
హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో వన్డే సిరిస్‌లోనైనా పరువు దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో భారీ మార్పులకు క్రికెట్ ఆస్ట్రేలియా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పలువురు కీలక ఆటగాళ్లపై వేటు వేసింది.
జనవరి 12 నుంచి టీమిండియా ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరిస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం 14 మందితో కూడిన వన్డే జట్టుని ప్రకటించింది. సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ ఉస్మాన్ ఖవాజాకు సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుతం టెస్టు సిరిస్‌లో రాణిస్తోన్న స్పిన్నర్ నాథన్ లియాన్‌కు సెలక్టర్లు అవకాశమిచ్చారు.
గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తోన్న క్రిస్ లిన్, ట్రావిస్ హెడ్, డార్సీ షార్ట్, బెన్ మెక్‌డోర్మెట్, ఆల్ రౌండర్ ఆస్టన్ ఆగర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. భారత పర్యటన అనంతరం ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆసీస్ స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్ ఉడ్, కమ్మిన్స్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
14మందితో కూడిన జట్టులో పీటర్ సిడ్డిల్‌కు చోటు దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పీటర్ సిడ్డిల్ చివరగా ఆస్ట్రేలియా తరుపున నవంబర్ 2010లో ఆడాడు. అయితే, ఆసీస్ టాప్ పేసర్లకు విశ్రాంతి కల్పించిన నేపథ్యంలో పీటర్ సిడ్డిల్‌కు అవకాశమిచ్చినట్లు జాతీయ సెలక్టర్ ట్రెవర్ హోన్స్ తెలిపారు.
రిచర్డ్‌సన్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, బిల్లీ స్టాన్‌లేక్ పేసర్ల బృందానికి పీటర్ సిడ్డిల్ సారథ్యం వహించనున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ఆరోన్ ఫించ్ నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డే జనవరి 12న సిడ్నీ వేదికగా జరగనుంది. రెండో వన్డే అడిలైడ్‌లో, మెల్ బోర్న్‌లో మూడో వన్డే జరగనుంది.
మూడు వన్డే సిరిస్‌లో భారత్‌తో తలపడే ఆసీస్ జట్టు:
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్(వైస్ కెప్టెన్), అలెక్స్ క్యారీ(వైస్ కెప్టెన్), రిచర్డ్‌సన్, బిల్లీ స్టాన్‌లేక్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, పీటర్ సిడ్డిల్, నాథన్ లియాన్, ఆడమ్ జంపా