
సిడ్నీ: సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా భారత్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ప్లేయర్స్ జాతి వివక్షను ఎదుర్కొన్నారు. మూడవ టెస్ట్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులు భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌లపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్‌లోని రెండో రోజు మూడో రోజు ఈ ఆటగాళ్లపై స్థానికులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిందని పేర్కొంటూ అంపైర్లకు టీమిండియా మేనేజ్‌మెంట్ ఫిర్యాదు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే కూడా అంపైర్లకు ఫిర్యాదు చేశాడు.
ఇక అసలు విషయానికొస్తే భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడవ టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మూడో రోజు ఆట ముగుస్తుందనగా ... కెప్టెన్ అజింక్యా రహానే నేతృత్వంలోని సీనియర్ ప్లేయర్లు అంపైర్లను ఆశ్రయించారు. పాల్ రీఫెల్, పాల్ విల్సన్‌లను రహానే, అశ్విన్‌లు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సిరాజ్, మరియు బుమ్రాలపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే ఆటముగిశాక అంపైర్లు సెక్యూరిటీ అధికారులు చర్చించారు. ఈ చర్చలో టీమిండియా ప్లేయర్లు కూడా పాల్గొన్నట్లు సమాచారం. ప్రేక్షకులు ఈ వ్యాఖ్యలు చేసినందున గ్రౌండ్ సెక్యూరిటీని అధికారులు సంప్రదించారు. ఇక పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందిస్తామని అధికారులు చెప్పారు. అయితే ఐసీసీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.