హైదరాబాద్: ఆసీస్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌లో మిడిలార్డర్‌లో ఆడుతున్న తనపై చాలా ఒత్తిడి ఉందని మనీష్ పాండే వెల్లడించాడు. నాలుగో వన్డే నేపథ్యంలో పాండే మీడియాతో మాట్లాడాడు. 'అవును. మిడిలార్డర్‌లో నాపై చాలా ఒత్తిడి ఉంది. అందుకే అవకాశం దొరికిన మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణించి భారత్ జట్టుని గెలిపించడం ద్వారా జట్టులో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్నాను' అని పాండే అన్నాడు.
ఇందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నానని చెప్పుకొచ్చిన పాండే... ప్రస్తుతానికి నా టార్గెట్ అంతా తుది జట్టులో చోటు కోల్పోకుండా ఉండటమేనని మనీష్ పాండే వెల్లడించాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన మూడు వన్డేల్లో పాండే ఆట తీరు ఫరవాలేదనిపించింది.

అయితే తుది జట్టులో తనకు చోటు దక్కే అవకాశంపై ఇంకా అనుమానంగానే ఉందని తెలిపాడు. గాయం కారణంగా కొన్ని రోజులు టీమిండియాకి పాండే దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. భారత్-ఏ జట్టు తరుపున సూపర్ ఇన్నింగ్స్ ఆడి శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాండే చోటు దక్కించుకున్నాడు.
శ్రీలంకతో ముగిసిన సిరిస్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడపోయినప్పటికీ, ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో సెలక్టర్లు మరోసారి అవకాశం కల్పించారు. తొలి రెండు వన్డేల్లోనూ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మనీశ్ పాండే.. మూడో వన్డేలో ఆరోస్థానంలో బరిలోకి దించింది.
దీన్ని బట్టి చూస్తే పాండే ప్రాధాన్యత, ఫామ్‌పై జట్టు మేనేజ్‌మెంట్‌కి నమ్మకం సన్నగిల్లిందనే అనుమానం వ్యక్తం అవుతోంది. మిడిలార్డర్‌లో అవకాశం కోసం మరో బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సిరిస్‌లో మిగిలిన రెండు వన్డేల్లో పాండే ఒక సెంచరీ అయినా చేయాల్సి ఉంది.