హైదరాబాద్: వన్డేల్లో వరుసగా 10 విజయాలు సాధించాలన్న కోహ్లీసేన రికార్డుకు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. బెంగళూరు వేదికగా గురువారం భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 3-1కి తగ్గింది. అంతేకాదు భారత్ గడ్డపై ఎట్టకేలకు ఆస్ట్రేలియాకు ఓదార్పు విజయం లభించింది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకుని పరువు పోగొట్టుకున్న ఆస్ట్రేలియన్లు నాలుగో వన్డేలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు.
ఫలితంగా నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. ఆసీస్ నిర్దేశించిన 335 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది.

నాలుగో వన్డేలో టీమిండియా పోరాడి ఓడినా.. ఒక్క విషయంలో మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బెస్ట్ ఫినిషర్ అయిన ధోనీని ముందు పంపకుండా మనీష్ పాండేను పంపడంపై భారత క్రికెట్ అభిమానులు సీరియస్ అయ్యారు.
అసలు కెప్టెన్ కోహ్లి, టీమ్ మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తున్నదో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'ధోనిని ఇంకా లోయర్ మిడిలార్డర్‌లోనే పంపిస్తావా?' అని ఒక నెటిజన్ ప్రశ్నించగా... 'ధోనిని 4 లేదా ఐదో స్థానంలో ఆడనీయవా' అంటూ మరొక నెటిజన్ స్పందించాడు.
'నెక్ట్స్ టైమ్ ధోనీని 11వ స్థానంలో పంపించు' అంటూ మరొక అభిమాని విరాట్ కోహ్లీకి చురకలంటించారు. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే ఆదివారం నాగ్ పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరగనుంది.