హైదరాబాద్: బెంగుళూరు వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అవుటైనప్పుడు చోటు చేసుకున్న హైడ్రామాకు తన తప్పిదమే కారణమని ఆస్ట్రేలియా క్రికెటర్ పీటర్ హ్యాండ్స్ కోంబ్ తెలిపాడు. 'బాక్స్ వైపు చూడమని స్మిత్‌కు నేనే సూచించాను. డీఆర్‌ఎస్ నిబంధనలపై నాకు అవగాహన లేకపోవడంతో ఈ విధంగా చేశాను. అద్భుతమైన గేమ్‌లో పెడర్థాలు తీయొద్దు' అని ట్వీట్ చేశాడు.
బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 21వ ఓవర్లో ఉమేశ్ వేసిన మూడో బంతిని ఎదుర్కొన్న స్మిత్ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్లు భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో వెంటనే అంపైర్ కెప్టెన్ స్మిత్ అవుటైనట్లు ప్రకటించాడు. వెంటనే భారత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు. వెంటనే రివ్యూ కోరదామని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న హ్యాండ్స్ కోంబ్‌ను అడిగాడు.
దీంతో అతడు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపుతూ టీమ్ మేట్స్‌ను సలహా కోరమని సూచించాడు. ఇదంతా సమీపంలో ఉన్న కోహ్లీ గమనించి అంపైర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ఈ సమయంలో అంపైర్ నిగెల్ లాంగ్ కల్పించుకొని అది నిబంధనలకు విరుద్ధమని వారించడంతో మైదానాన్ని వీడి స్మిత్ వెళ్లిపోయాడు.

రెండో టెస్టు విజయానంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆటతీరుపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. డీఆర్ఎస్ పేరుతో మూడు రోజులుగా ఆస్ట్రేలియా జట్టు మోసానికి పాల్పడిందని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. డీఆర్ఎస్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ సిస్టమ్‌గా మార్చేశారని కోహ్లీ విమర్శించాడు.
గత మూడు రోజులుగా ఆసీస్ ఆటగాళ్లు మోసం చేస్తున్నారని ఆరోపించాడు. 'మాకు డీఆర్‌ఎస్‌లో కచ్చితత్వం లేదు. కానీ మా నిర్ణయాలు మేం తీసుకుంటాం. మేము కన్ఫర్మేషన్ కోసం డ్రెస్సింగ్ రూంలో వారిని అడగం. నేను వారు ఈ విధంగా చేయడం రెండుసార్లు చూశాను. అంపైర్‌కు ఈ విషయం చెప్పాను' అని కోహ్లీ అన్నాడు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆసీస్ క్రికెటర్ హ్యాండ్స్ కోంబ్ ఈ తప్పుకు తనదీ బాధ్యత అంటూ ముందుకొచ్చాడు. ఇదిలా ఉంటే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 16 నుంచి రాంచీలో ప్రారంభం కానుంది.