For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

24 ఏళ్ల తర్వాత భారత జట్టులో హైదరాబాదీ.. అభిమాన బౌలర్‌ ప్లేస్‌లో! ఇది మనోడి ప్రస్థానం!

India vs Australia: How did Mohammed Siraj earn a Test debut in Team India

హైదరాబాద్: అతడి లక్ష్యం భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఆడటం. ఈ ప్రయాణంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైయ్యాయి. అయినా ఆటుపోట్లకు ఎదురీదుతూ కష్టాల కడలిని దాటుకుంటూ.. తన కలల ప్రయాణంలోని గమ్యాన్ని చేరాడు. అతడు మరెవరో కాదు మన హైదరాబాదీ పేసర్ మహమ్మద్‌ సిరాజ్‌. ఆట కోసం అన్నీ తానై నిలిచిన తండ్రి అనంతలోకాలకు వెళ్లినా.. సిరాజ్ ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. తాను ఎంతగానో ప్రేమించే నాన్న కడచూపునకు దూరమైనా.. భారత్‌కు ఆడాలన్న కాంక్ష అతడిని ముందుకు నడిపించింది. గుండెలోతుల్లోని దుఃఖాన్ని దిగమింగుకుంటూ తొలిసారి టెస్టుల్లో భారత్ తరఫున సిరాజ్‌ అరంగేట్రం చేశాడు.

 ఆటో రిక్షా నడుపుతూ:

ఆటో రిక్షా నడుపుతూ:

హైదరాబాద్ నగరంలో ఉండే మహమ్మద్‌ సిరాజ్ కుటుంబం చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండేది. సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ (53) సాధారణ ఆటో డ్రైవర్. ఆటో రిక్షా నడుపుతూ రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంబాన్ని పోషించేవాడు. చిన్నప్పటి నుంచి సిరాజ్ కల ఒక్కటే.. టీమిండియాకు ఆడడం. ఇందుకోసం సిరాజ్ సహా అతడి తండ్రి కూడా ఎంతో కష్టపడ్డాడు. గల్లీ క్రికెట్‌లో టెన్నిస్‌ బంతితో బుల్లెట్‌లాంటి బౌన్సర్లు విసురుతుండడంతో గౌస్ కూడా సంతోషపడేవారు. ఎలాగైనా కొడుకుని జాతీయ జట్టుకు ఆడించాలని మరింత కష్టపడ్డారు. బంతి చేతబట్టినప్పటి నుంచి సిరాజ్‌ కన్న కల ఇన్నాళ్లకు నిజమైంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఎదురుచూస్తున్న ఈ హైదరాబాదీ ఎట్టకేలకు భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్‌:

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్‌:

దేశవాళీలో సిరాజ్ అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనలన్నీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లలోనే వచ్చాయి. ఎరుపు బంతితోనే అతను ఎక్కువగా తన పదును చూపించాడు. సీమ్‌ను సమర్థంగా ఉపయోగించుకునే అతని గ్రిప్, బౌన్సర్లు సిరాజ్‌ బౌలింగ్‌లో ప్రధాన బలాలు. తన తొలి రంజీ సీజన్‌ (2016-17)లోనే హైదరాబాద్‌ తరఫున 18.92 సగటుతో 41 వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2018లో 10 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో సిరాజ్‌ 19.80 సగటుతో 55 వికెట్లు పడగొట్టాడు. ఇందులో దక్షిణాఫ్రికా ‘ఎ'పై రెండుసార్లు ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు తీయగా.. ఆస్ట్రేలియా ‘ఎ'పై 8 వికెట్లతో చెలరేగిన ప్రదర్శన కూడా ఉంది. ఆసీస్‌ ‘ఎ' జట్టులో హెడ్, లబ్‌షేన్, ఖవాజా లాంటి టెస్టు క్రికెటర్లున్నారు. భారత్‌ ‘ఎ' తరఫున సిరాజ్‌ 16 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఇవన్నీ రంజీ ట్రోఫీకంటే నాణ్యతాపరంగా ఎక్కువ స్థాయివే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లలో కలిపి 12 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌ 27.63 సగటుతో 44 వికెట్లు పడగొట్టాడు.

8 పరుగులకు 3 వికెట్లు:

8 పరుగులకు 3 వికెట్లు:

సిరాజ్ అద్భుత ఆటతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించడం చకచకా జరిగిపోయాయి. నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు అతని సామర్థ్యంపై కొన్ని అనుమానాలు రేపినా.. తాజా ఐపీఎల్‌లో కోల్‌కతాపై 8 పరుగులకు 3 వికెట్లు తీసిన ప్రదర్శన సిరాజ్‌ను మళ్లీ సీన్‌లోకి తీసుకొచ్చింది. ఐపీఎల్‌ ప్రదర్శన స్ఫూర్తితో బాక్సింగ్‌ డే టెస్టులో సత్తాచాటేందుకు సిరాజ్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. అడిలైడ్‌ టెస్టులో మొహ్మద్ షమీ గాయపడటంతో అతడి స్థానంలో సిరాజ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ ప్రారంభించక ముందు.. మిచెల్ స్టార్క్‌, షమీ నా అభిమాన బౌలర్లు అని చెప్పిన సిరాజ్‌.. ఈ రోజు అదే షమీ స్థానంలో జట్టులోకి రావడంతో పాటు స్టార్క్‌కు బంతులు విసరనున్నాడు.

తండ్రిని కడసారి చూసేందుకు రాలేదు

తండ్రిని కడసారి చూసేందుకు రాలేదు

అయితే క్లబ్‌లు, రంజీలు, ఫ్రాంచైజీలు ఇలా ఎన్ని మ్యాచ్‌లు ఆడినా తెలుపు రంగు దుస్తుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది ఏ క్రీడాకారుడికైన అత్యంత ఉద్వేగభరిత క్షణం. సిరాజ్‌ విషయానికి వస్తే అది మరింత భావోద్వేగ పూరితం. టెస్టు సిరీస్‌కు ఎంపికై ఆసీస్‌ వెళ్లిన అనంతరం.. ఊపిరితిత్తల వ్యాధితో బాధపడుతున్న సిరాజ్‌ తండ్రి మహమ్మద్‌ గౌస్‌ మృతిచెందారు. ఈ క్షణంలో మరో ఆటగాడైతే జట్టును వీడి తండ్రిని కడసారి చూసేందుకు వచ్చేవాడు కానీ ఈ స్పీడ్‌స్టర్‌ మాత్రం జాతీయ విధే ముఖ్యమని అక్కడే ఉండిపోయాడు. ‘మేరా బేటా దేశ్‌ కా నామ్‌ రోషన్‌ కరేగా' అని తండ్రి తరచూ చెప్పే మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన సిరాజ్‌.. ఆసీస్‌ గడ్డపై సత్తాచాటి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలనుకుంటున్నాడు.

స్వదేశానికి వస్తే:

స్వదేశానికి వస్తే:

ఆసీస్‌ పర్యటన కోసం ప్రకటించిన (అక్టోబర్‌ 26) జట్టులో తన పేరు ఉండటంతో తండ్రికి ఫోన్‌ చేసిన సిరాజ్‌.. ‘అబ్బూ మై టెస్ట్‌ టీమ్‌ మే సెలెక్ట్‌ హోగయా. సిరీస్‌ ఖేల్‌నే ఆస్ట్రేలియా జా రాహా హూన్‌' (నాన్నా.. నేను టెస్టు జట్టుకు ఎంపికయ్యా. సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్తున్నా) అని ఆనందంగా చెప్పాడు. అయితే తుది జట్టులో చోటు దక్కించుకునే సమయానికి మాత్రం సిరాజ్‌ తండ్రి గౌస్‌ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. దుఃఖాన్ని దిగమింగి.. నవంబర్‌ 20న భారత జట్టు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో తండ్రి చనిపోయిన వార్త సిరాజ్‌కు చేరింది. ఊహించని ఘటనతో ఒక్కసారిగా కుప్పకూలిన సిరాజ్‌.. తండ్రిని చూసేందుకు స్వదేశానికి వెళ్లేందుకు కూడా నిరాకరించాడు. క్వారంటైన్‌ నిబంధనల నేపథ్యంలో స్వదేశానికి వస్తే.. తిరిగి ఆస్ట్రేలియా చేరడం కష్టం కావడంతో బీసీసీఐ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు.

24 ఏళ్ల తర్వాత:

24 ఏళ్ల తర్వాత:

వీవీఎస్‌ లక్ష్మణ్‌ (1996) తర్వాత హైదరాబాద్‌లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్‌ మొహ్మద్ సిరాజే కావడం విశేషం. మధ్యలో ప్రజ్ఞాన్‌ ఓజా ఆడినా.. అతను భువనేశ్వర్‌లో పుట్టాడు. సిరాజ్‌ ఇప్పటివరకు భారత్ తరఫున ఒక వన్డే, మూడు టీ20లు ఆడాడు. ఈరోజు టెస్ట్ ఆడుతున్నాడు. సిరాజ్‌ మున్ముందు మరింత సత్తా చాటాలని, జట్టులో చోటు పదిలం చేసుకోవాలని ఆశిద్దాం.

Boxing Day Test: గంగూలీలా ధోనీ.. మహీలా కోహ్లీ.. విరాట్‌లా రహానే చేయలేరు!!

Story first published: Saturday, December 26, 2020, 9:57 [IST]
Other articles published on Dec 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+