పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ సిరీస్‌ను తప్పనిసరిగా గెలవాలి.
ఈ నేపథ్యంలో మూడో టెస్టులో విజయం సాధించి అయిదు టెస్టుల సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే గబ్బా వేదికగా శనివారం నుంచి జరగనున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తు చేయడానికి మూడు వ్యూహాలతో బరిలోకి దిగాలని భారత జట్టుకు హర్భజన్ సింగ్ సూచించాడు. ఏఏ విభాగాల్లో పురోగతి సాధించాలో వివరించాడు. టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారిన ట్రావిస్ హెడ్‌ను బోల్తాకొట్టించడానికి ప్రణాళికలు పంచుకున్నాడు. త్రిశూల వ్యూహం భజ్జీ మాటల్లో...

''మొదటిది, ఎంతో ముఖ్యమైనది.. బ్యాటింగ్ బాగా చేయాలి. భాగస్వామ్యాలను నిర్మించుకోవాలి. ముందుగా 30-40 పరుగుల భాగస్వామ్యాల నెలకొల్పడానిపై దృష్టి సారించాలి. ఆ తర్వాత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలి. పెర్త్ టెస్టులో అలానే విజయం సాధించాం. తొలి ఇన్నింగ్స్‌లో 300-350 పరుగులు చేయడానికి ప్రయత్నించాలి''
''రెండోది.. చక్కగా బౌలింగ్ చేయాలి.ట్రావిస్ హెడ్ తలనొప్పిగా మారాడు. కవర్స్‌లో అతను పరుగులు సాధిస్తున్నాడు. అతను స్ట్రైయిట్‌గా, లెగ్ స్టంప్ వైపు ఆడేలా బౌలింగ్ చేయాలి. స్లో బౌన్సర్స్ వేయాలి. అప్పుడు అతన్ని అడ్డుకోవచ్చు. ఇక మూడో విషయం..తుది జట్టులో మార్పులు చేయాలి. హర్షిత్ రాణా స్థానంలో ప్రసిధ్ కృష్ణ లేదా ఆకాశ్ దీప్‌ను తీసుకోవాలి. రాణా సరిగ్గా ఆడట్లేదని నా ఉద్దేశం కాదు. బ్రిస్బేన్ ఫాస్ట్-బౌన్సీ పిచ్‌కు తగ్గట్లుగా జట్టును ఎంపిక చేయాలి. అక్కడ ప్రసిధ్ సత్తాచాటగలడు'' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.