కెమరూన్ గ్రీన్ విధ్వంసకాండ
ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆసీస్ ఓపెనర్ కెమరూన్ గ్రీన్ విధ్వంస కాండ రచించాడు. అతను భువీ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే సిక్స్, మూడో బంతికి ఫోర్ కొట్టి తన ప్రతాపాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ వేసిన రెండో ఓవర్లో 2ఫోర్లు కొట్టాడు. ప్రతి బంతి హిట్టింగ్ కోసమే చూశాడు. ఇక మూడో ఓవర్ బుమ్రా వేయగా అతని బౌలింగ్లో ఒక ఫోర్, రెండు సిక్సులు కొట్టి ఔరా అనిపించాడు. అతని దెబ్బకు స్టేడియంలో ప్రేక్షకులు కూడా సైలెంట్ అయిపోయారు. వీడెవడ్రా బాబు ఇలా కొడుతున్నాడు అనిపించింది. ఇక నాలుగో ఓవర్లో అక్షర్ పటేల్ ఫించ్ (6)ను క్యాచ్ ఔట్ చేయడంతో 3.3ఓవర్లలోనే 44పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే అదే ఓవర్లో చివరి మూడు బంతులను వరుసగా గ్రీన్ ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో 19బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.
కాంట్రవర్సీ రనౌట్
అయితే అయిదో ఓవర్లో గ్రీన్ భువీ బౌలింగ్లో క్యాచ్ ఔటవ్వడంతో ఆసీస్ స్కోరుకు కళ్లెం పడింది. 5ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ స్కోరు 2వికెట్లు కోల్పోయి 62పరుగులకు చేరుకుంది. ఇక ఆ తర్వాత మ్యాక్సీ, స్మిత్ తడబడ్డారు. 8వ ఓవర్లో చాహల్ బౌలింగ్లో మ్యాక్స్‌వెల్ కాంట్రవర్సీ రీతిలో రనౌట్ అయ్యాడు. బౌండరీ వద్ద అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన అక్షర్ పటేల్ డైరెక్ట్ త్రో వేయగా.. అది నేరుగా స్ట్రైకర్ ఎండ్ వైపు వికెట్లను గిరటేసింది. అయితే దినేష్ కార్తీక్ ముందుగా గ్లోవ్స్ వికెట్లకు తాకించడంతో ఇది ఔటా కాదా అనే విషయంలో కాసేపు డైలామా ఏర్పడింది. రూల్స్ ప్రకారం.. ముందే బెయిల్ లేస్తే తర్వాత బంతి తాకినా వికెట్ గ్రౌండ్లో నుంచి బయటికి తీయాల్సి ఉంటుంది. అయితే అంపైర్ ఏ ప్రకారం ఔటిచ్చాడనేది తెలియాల్సి ఉంది.
టిమ్ డేవిడ్, సామ్స్ చెలరేగడంతో
ఆ తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ అంత సజావుగా ఏం సాగలేదు. స్మిత్ (9పరుగులు 10బంతుల్లో)ను చాహల్ స్టంపౌట్ చేశాడు. జోష్ ఇంగ్లీష్ (24పరుగులు) కాసేపు ప్రతిఘటించాడు. అయితే 14వ ఓవర్లో అక్షర్ పటేల్ అతన్ని, అలాగే ప్రమాదకర్ వేడ్ (1)ను ఔట్ చేసి మ్యాచ్‌ను కాస్త మలుపు తిప్పాడు. అయితే చివర్లో టిమ్ డేవిడ్ (54పరుగులు 26బంతుల్లో) అంతర్జాతీయ టీ20ల్లో తన తొలి హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడాడు. భువీ వేసిన 18వ ఓవర్లో అతను వరుసగా రెండు సిక్సులు, ఒక ఫోర్ బాదాడు. అతనికి తోడుగా డేనియల్ సామ్స్ (28పరుగులు 20బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) సహకారమందించాడు. వీరిద్దరు కలిసి 7వ వికెట్‌కు 68పరుగుల భాగస్వామ్యాన్నిచ్చారు. దీంతో స్కోరు 7వికెట్లు కోల్పోయి 186కు చేరుకుంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున వీళ్లిద్దరు ఆడుతారనే సంగతి తెలిసిందే.
తుది జట్లు :
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఆరోన్ ఫించ్ (సి), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్ (w), డేనియల్ సామ్స్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications
