India vs Australia: ఈసారి పుజారాకు అంత వీజీ కాదు.. ఆ చాలెంజ్ తప్పదు: మెక్‌గ్రాత్

సిడ్నీ: ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్ పుజారాకు అంత ఈజీ కాదని, సవాల్ తప్పదని ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అంటున్నాడు. 2018-19 పర్యటనలో 2-1తో సిరీస్ గెలిచి ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. మూడు సెంచరీలు బాది 500లకు పైగా పరుగులు సాధించాడు. ఇప్పుడు మాత్రం పుజారాకు తమ బౌలర్లు ఆ చాన్స్ ఇవ్వరని మెక్‌గ్రాత్ ధీమా వ్యక్తం చేశాడు.

పుజారాకు ఆ మనస్తత్వం లేదు
తాజాగా గ్లెన్ మెక్‌గ్రాత్ ఓ మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ... 'చతేశ్వర్ పుజారా టీమిండియా బ్యాటింగ్‌లో కీలక ఆటగాడు. నిలకడైన బ్యాటింగ్‌తో క్రీజ్‌లో పాతుకుపోతాడు. పరుగులు చేయనప్పుడు ఒత్తిడికి ఏమాత్రం గురికాడు. ఆధునిక యుగంలో ఇది ప్రత్యేకమైనది. ప్రస్తుత ఆటగాళ్లలో తొలి ఓవర్ నుంచే లేదా ఆ తర్వాత పరుగులు చేయాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఒక మెయిడిన్ ఓవర్ పడగానే రన్స్ చేయాలనుకుంటారు. పుజారాకు ఆ మనస్తత్వం లేదు. చాలా ప్రశాంతంగా ఆడుతాడు. ఇదే చివరిసారి అతనికి సహాయపడింది' అని అన్నాడు.

అతి పెద్ద చాలెంజ్ తప్పదు
'కరోనా వైరస్ కారణంగా చతేశ్వర్ పుజారా ఈ మధ్య కాలంలో క్రికెట్ ఆడలేదు. ప్రాక్టీస్ కూడా చేయలేదు. ఇది పెద్ద ప్రభావాన్ని చూపబోతుంది. పుజారా ఏ క్రికెట్ ఆడలేదు కాబట్టి అతను చివరి సిరీస్ కంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈసారి పుజారాకు అతి పెద్ద చాలెంజ్ తప్పదు. గతంలో మాదిరిగా ఈసారి పుజారాకు మా బౌలర్లు చాన్స్ ఇవ్వరు' అని ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రావడం ఆసీస్‌కు కలిసి వస్తుందని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. విరాట్ జట్టులో లేకపోతే అది కచ్చితంగా సిరీస్‌పై ప్రభావం చూపిస్తుందని, ఎందుకంటే అతడు నాణ్యమైన ఆటగాడు అని పేర్కొన్నాడు.

కోహ్లీ ప్రభావం చూపాల్సిందే
'మొదటి టెస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే.. ఆస్ట్రేలియాలో భారత్ డే-నైట్ టెస్ట్ ఇప్పటివరకు ఆడలేదు. రాత్రి సమయం, సూర్యాస్తమయం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. మొదట బౌలింగ్ చేసినా లేదా బ్యాటింగ్ చేసినా ప్రభావం ఉంటుంది. విరాట్ కోహ్లీ సిరీస్‌లో ప్రభావం చూపాలంటే.. అతను ఆడుతున్న ఏకైక టెస్టులో బాగా ఆడాల్సిందే. అది సిరీస్ ఫలితాన్నే మార్చేస్తుంది. రెండు సంవత్సరాల క్రితం అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్ట్ విజయం భారత జట్టుకు మంచి విశ్వాసాన్ని ఇచ్చింది' అని మెక్‌గ్రాత్ చెప్పాడు.

టాప్ క్లాస్ పేసర్లు ఉన్నారు
'రోహిత్ శర్మ నాణ్యమైన బ్యాట్స్‌మన్. కానీ టెస్టుల్లో గొప్పగా ఏమీ సాధించలేదు. ఈ సారి తొలి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లడం రోహిత్‌కు కచ్చితంగా కలిసొస్తుంది. కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ మాత్రమే రాణిస్తాడని భావించలేం. అజింక్య రహానె, ఛటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్‌తో భారత్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. వీరిలో ఎవరైనా ఆస్ట్రేలియా సిరీస్‌లో తమదైన ముద్ర వేయొచ్చు. అది రోహిత్ చేస్తాడని భావిస్తున్నా' అని ఆసీస్ దిగ్గజం అన్నాడు. ఉమేష్, షమీ, బుమ్రా లాంటి టాప్ క్లాస్ పేసర్లు టీంఇండియాలో ఉండడం కలిసొచ్చే అంశమన్నాడు. పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ కూడా తమ జట్టులో ఉన్నారని గుర్తుచేశాడు.
టీమిండియాకు అధికారిక కిట్ స్పాన్సర్‌గా ఎంపీఎల్.. ఇక నుంచి కొత్త జెర్సీలు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications