హైదరాబాద్: చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ కోహ్లీ వల్లే తాను అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినట్లు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పేర్కొన్నాడు. ఆసీస్‌పై స్వేచ్ఛగా ఎదురుదాడి చేయమని కోహ్లీ చెప్పడం వల్లే తాను స్వేచ్ఛగా వికెట్లు తీయడం సాధ్యమవుతుందని చాహల్ తెలిపాడు.
'ప్రధానంగా మణికట్టు స్పిన్నర్లు ఎక్కువగా అటాక్ చేస్తారు. కానీ మా కెప్టెన్ మాత్రం స్పిన్నర్లను ఎదురుదాడికి దిగమనే చెబుతాడు. ఎందుకంటే మా కెప్టెన్ దూకుడు ఉంటాడు కాబట్టి. మమ్మల్ని కూడా అటాక్ చేయమంటూ స్వేచ్ఛగా బౌలింగ్ చేసే అవకాశం కల్పిస్తాడు' అని చాహల్ అన్నాడు.

'కొన్ని సందర్బాల్లో మాత్రం మా ప్రణాళికల్ని సమయాన్ని బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది. నేను, కుల్దీప్ ఇద్దరం ఎటాకింగ్ బౌలర్లం కాబట్టి పరిస్థితిని బట్టి ప్రణాళికలను మార్చుకుంటాం. ఇక్కడ కుల్దీప్ యాదవ్ నుంచి సహకారం లభించింది. మేమిద్దరం వికెట్లే లక్ష్యంగా బౌలింగ్ చేశాం' అని చాహల్ తెలిపాడు.
'తొలి వన్డేలో కోహ్లీ స్వేచ్ఛ ఇచ్చాడే కాబట్టి, మూడు వికెట్లు సాధించా. ఎప్పుడు కూడా సేఫ్ జోన్‌లో ఉన్నామని ఆడకూడదు. అవతలి జట్టును ఇబ్బందుల్లోకి నెట్టే యత్నం చేస్తేనే పైచేయి సాధిస్తాం. మనం ఏ సమయంలోనైనా సేఫ్ గా ఉన్నామని భావిస్తే, అది మ్యాచ్‌లను గెలిపించలేం' అని చాహల్ పేర్కొన్నాడు.
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఐదు ఓవర్లు బౌలింగ్ వేసిన చాహల్ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.