
ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి యువ ఆటగాడు మనీష్ పాండేను తీసుకునే వీలుందని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో విజయం సాధించడం రాబోయే టెస్టు సిరీస్‌పై ప్రభావం చూపుతుందన్నాడు. తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలైన కోహ్లీసేన ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. మూడు మ్యాచుల సిరీస్‌లో 2-0 మరో మ్యాచ్ ఉండగానే భారత్ గెలుచుకుంది. ఈ రోజు మధ్యాహ్నం చివరి మ్యాచ్ జరుగనుంది.
మాజీ పేసర్ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ..వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్లు చేసిందని, అదే క్రమంలో టీమిండియా పొట్టి క్రికెట్‌లో విజయం సాధించిందని చెప్పాడు. టీ20 సిరీస్‌లో విజయం సాధించడం రాబోయే బోర్డర్-గావస్కర్ సిరీస్‌పై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. ఈ రెండు సిరీసుల్లో కొందరు వేర్వేరు ఆటగాళ్లు ఉన్నారని, అయినా ఈ ఫలితం వారిపై మానసికంగా ప్రభావం చూపుతుందని వివరించాడు.
రెండో టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్లపై స్పందించిన ఆశిష్ నెహ్రా.. మూడో టీ20లో వారిని తీసేయాల్సిన అవసరం లేదన్నాడు. టీ నటరాజన్ మినహా వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకుర్, యుజువేంద్ర చహల్ 8కిపై ఎకానమీతో పరుగులిచ్చారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి మనీష్ పాండేను తీసుకునే వీలుందని మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఒక్క మార్పు తప్పితే ఏదీ ఉండదని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ జట్టును నడిపిస్తాడని ఆశిష్ నెహ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారత్ ఇప్పటికే రెండు టీ20లు గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి మానసికంగా టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవ్వాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని చూస్తోంది. స్వల్ప గాయంతో రెండో టీ20కి దూరమైన ఆసీస్ కెప్టెన్ ఫించ్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది. క్లీన్‌స్వీప్‌ను తప్పించుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న కంగారూలు మూడో టీ20లో ఎలాగైనా సత్తాచాటాలని పట్టుదలగా ఉన్నారు. గత మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన ఓపెనర్ వేడ్‌తో కలిసి ఫించ్ బ్యాటింగ్‌కు వస్తే.. షార్ట్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.