For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా బోణీ చేసింది: బెంగళూరు వన్డేలో కోహ్లీసేన ఓటమి

By Nageshwara Rao

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో ఆసీస్ బోణీ చేసింది. బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో వన్డేను ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 335 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది.

భారత బ్యాట్స్‌మెన్లలో రహానే 53, రోహిత్ శర్మ 65, కోహ్లీ 21, పాండ్యా 41 పరుగులు చేయగా... జాదవ్ 67, పాండే 33, ధోనీ 13, షమీ 6, అక్షర్ పటేల్ 5, ఉమేశ్ యాదవ్ 2 పరుగులు చేశారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరిస్‌లో చివరిదైన ఐదో వన్డే ఆదివారం నాడు విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.


భారత్ ఇన్నింగిస్ సాగిందిలా:

భారత్ విజయానికి వర్షం అడ్డంకి
నాలుగో వన్డేలో విజయం దిశగా దూసుకెళ్తున్న టీమిండియాకు వరుణుడు అడ్డు తగిలాడు. 41.1 ఓవర్ వద్ద వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆట నిలిచిపోయే సమయానికి కేదార్ జాదవ్ 53, మనీష్ పాండే 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 53 బంతుల్లో 84 పరుగులు చేయాల్సి ఉంది.

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
ఆస్ట్రేలియాతో జరగుతున్న నాలుగో వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 41 పరుగుల చేసిన హార్థిక్ పాండ్యా.. జంపా బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మనీష్ పాండే క్రీజులోకి వచ్చాడు.

30 ఓవర్లకు భారత్ స్కోరు 182/3
నాలుగో వన్డేలో భారత్ విజయం దిశగా సాగుతోంది. కోహ్లీ అవుటైన తర్వాత బరిలోకి దిగిన కేదార్ జాదవ్‌తో కలిసి హార్ధిక్ పాండ్యా నిదానంగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో 3 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న కేదార్ జాదవ్ అతడికి సహకారం అందిస్తున్నాడు. ఇద్దరూ కలిసి 34 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

India vs Australia, 4th ODI

కోహ్లీ అవుట్
బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో కెప్టెన్ కోహ్లీ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 135 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత్, 147 పరుగుల వద్ద కల్టెర్ నైల్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీ (21) బౌల్డయ్యాడు. ప్రస్తుతం 25 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

రోహిత్‌ శర్మను రనౌట్ చేసిన కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ గందరగోళానికి గురయ్యారు. కేన్‌ రిచర్డ్‌సన్‌ వేసిన 22.6వ బంతిని కోహ్లీ స్లిప్‌లోకి తరలించాడు. వేగంగా వెళ్తున్న బంతిని ఫీల్డర్‌ స్మిత్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇంతలోనే కోహ్లీ కొద్ది దూరం పరుగెత్తి మళ్లీ తన ఎండ్‌కు వచ్చాడు. అవతలి నుంచి రోహిత్‌ కూడా వచ్చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (65) అవుటయ్యాడు. 2013లో ఇదే చిన్నస్వామి మైదానంలోనే ఇలాగే జరిగింది. కానీ అప్పుడు విరాట్ కోహ్లీ రనౌటయ్యాడు. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కోహ్లీ 21, పాండ్యా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

India vs Australia, 4th ODI

తొలి వికెట్ కోల్పోయిన భారత్
ఆస్ట్రేలియా నిర్దేశించిన 335 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 106 పరుగుల వద్ద అజింక్యా రహానే (53) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. కానే రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి రహానే పెవిలియన్ చేరాడు.

రహానే హాఫ్ సెంచరీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్ అజింక్యా రహానే అర్ధ సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు పూర్తి చేశాడు. మరో ఎండ్‌లోఉన్న రోహిత్ శర్మ కూడా నిదానంగా ఆడుతూ అర్ధ సెంచరీకి చేరువలోకి వచ్చాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 89 పరుగులు చేసింది.

10 ఓవర్లకు భారత్ 65/0
ఆస్ట్రేలియా నిర్దేశించిన 335 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను దాటిగా ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానేలు జాగ్రత్తగా ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం పది ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (26), రహానే (38) పరుగులు చేశాడు.


భారత్ విజయ లక్ష్యం 335
బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేనకు 335 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో వార్నర్ (124) సెంచరీ, ఫించ్ (94) పరుగులతో రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 231 పరుగులు జోడించారు.

బౌండరీల వర్షం కురిపిస్తూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే పార్ట్‌టైమ్ బౌలర్ కేదార్ జాదవ్ .. వార్నర్‌ను అవుట్ చేయడంతో వీళ్లద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే ఫించ్ (94), స్మిత్ (3) కూడా అవుటవ్వడంతో ఆసీస్ స్కోరు నెమ్మదించింది. చివర్లో హ్యాండ్స్‌కాంబ్ (43) చెలరేగడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, కేదార్ జాదవ్ ఒక వికెట్ తీసుకున్నారు.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీరు సాగిందిలా:

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్
భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 319 పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (43) అవుటయ్యాడు. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ అవుటైన తర్వాత వేడ్ క్రీజులోకి వచ్చాడు. దీంతో 49 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. స్టోయినిస్ 3, వేడ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 299 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ (29) అవుటయ్యాడు. ట్రావిస్ హెడ్ అవుటైన తర్వాత మార్కస్ స్టోయినిస్ క్రీజులోకి వచ్చాడు. దీంతో 47 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ప్రస్తుతం పీటర్ హ్యాండ్స్‌కోంబ్ 29 పరుగులు చేయగా స్టోయినిస్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు.

భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా
నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. 230 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోయిన ఆసీస్ ఆ తర్వాత ఐదు పరుగుల తేడాలో మూడు వికెట్లు చేజార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారీ స్కోరు దిశగా సాగే ఆసీస్ స్కోరు బోర్డు కాస్తంత నెమ్మదించింది. మరోవైపు ప్రస్తుతం క్రీజులో ఉన్న ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌లు జాగ్రత్తగా ఆడుతూ భారీ స్కోరే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 44 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 17, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పెవిలియన్‌కు చేరిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా బౌలర్లు ఫామ్‌లోకి వచ్చారు. వరుసగా మూడు వికెట్లు తీసి ఆసీస్ జోరును అడ్డుకున్నారు. జట్టు స్కోరు 231 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ఆ తర్వాత ఐదు పరుగుల తేడాలో మరో రెండు వికెట్లను కోల్పోయింది. ఉమేశ్ బౌలింగ్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (3) పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ప్రస్తుతం 38 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 2, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Smith

సెంచరీ మిస్ చేసుకున్న ఆరోన్ ఫించ్
బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. సెంచరీకి చేరువలో ఉన్న ఆరోన్ ఫించ్‌ 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఫించ్ పెవిలియన్ బాట పట్టాడు. 35 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా నష్టపోని ఆసీస్ ఐదు బంతుల తేడాలో ఒకే స్కోరు వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 36 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
బెంగళూరు వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో మొత్తానికి భారత బౌలర్ల వికెట్ తీశారు. జట్టు స్కోరు 231 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ (124) అవుటయ్యాడు. ఇన్నింగ్స్ 34.6 ఓవర్ వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 35 ఓవర్లకు గాను ఆసీస్ వికెట్ కోల్పోయి 231 పరుగులు చేసింది.

100వ వన్డేలో ఫోర్‌తో సెంచరీ చేసిన వార్నర్
బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతోన్న నాలుగో వన్డేలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో కదం తొక్కాడు. 103 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో వార్నర్ సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో వార్నర్‌కి ఇది 14వ సెంచరీ కావడం విశేషం. మరోవైపు ఈ సెంచరీ వార్నర్‌కి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే బెంగళూరు వన్డే వార్నర్‌కి 100వ వన్డే కావడం విశేషం. దీంతో 31 ఓవర్లకు గాను ఆసీస్ వికెట్ నష్టపోకుండా 197 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఫించ్‌ 81, వార్నర్‌ 103 పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్, బుమ్రా, కుల్‌దీప్‌లకు రెస్ట్ ఇవ్వడంతో వాళ్ల స్థానంలో వచ్చిన షమి, ఉమేష్, అక్షర్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. పైగా పిచ్ కూడా బౌలర్లకు ఎంతమాత్రం సహకరించడం లేదు.

ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ
బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతోన్న నాలుగో వన్డేలో ఆసీస్ ఓపెనర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. తొలుత దూకుడుగా ఆడిన ఫించ్ ఆ తర్వాత నెమ్మదించాడు.ఇప్పటికే డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా, మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ కూడా హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన ఆరోన్ ఫించ్ ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు నాలుగో వన్డేలో 65 బంతుల్లో ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో 26 ఓవర్లకు ముగిసే సరికి ఆసీస్‌ వికెట్‌ ఏమీ నష్టపోకుండా 161 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఫించ్‌ 61, వార్నర్‌ 88 పరుగులతో ఉన్నారు.

100వ వన్డేలో డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ
తన కెరీర్‌లో 100వ వన్డే ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 45 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన వార్నర్‌‌కు ఇది వన్డేల్లో 17వ హాఫ్ సెంచరీ. మరో ఓపెనర్‌ ఫించ్‌తో కలిసి వార్నర్ నిలకడగా ఆడుతున్నాడు. దీంతో 17 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ వికెట్‌ ఏమీ నష్టపోకుండా 104 పరుగులు చేసింది. ప్రస్తుతం ఫించ్‌ 42, వార్నర్‌ 56 పరుగులతో ఉన్నారు.

100 పరుగులు దాటిన ఆస్ట్రేలియా స్కోరు
బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతోన్న నాలుగో వన్డేని ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓపెనర్లు ఫించ్‌, వార్నర్‌ నిలకడగా ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్కోరు 100 పరుగులు దాటింది. ప్రస్తుతం 16 ఓవర్లకు గాను ఆసీస్ వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. వార్నర్‌ 54, ఫించ్‌ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతోన్న ఆసీస్ ఓపెనర్లు 50/0
బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతోన్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ప్రస్తుతం వార్నర్‌ 20, ఫించ్‌ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లను వీరిద్దరూ సమర్ధవంతగా ఎదుర్కొంటున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియాల జట్ల మధ్య నాలుగో వన్డే ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్‌ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌కు ఇది 100వ వన్డే.

కాగా, తుది జట్టులో ఆసీస్‌ రెండు మార్పులు చేసింది. వేడ్‌, అడమ్‌ జంపాను తిరిగి జట్టులోకి తీసుకుంది. ఇక టీమిండియా కూడా తుది జట్టులో మూడు మార్పులు చేసింది. కుల్దీప్‌, భువనేశ్వర్‌, బుమ్రాలకు విశ్రాంతి కల్పించి వారి స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమి, అక్షర్‌ పటేల్‌లను తీసుకున్నారు.

ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్‌ను 3-0తో భారత జట్టు కైవసం చేసుకుంది. చివరి రెండు వన్డేల్లో కూడా విజయం సాధించి ఆసీస్‌ను వైట్ వాష్ చేయాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది. అంతేకాదు కోహ్లీ సేన కనుక ఈ మ్యాచ్‌ నెగ్గితే వన్డేల్లో నెంబర్‌వన్‌ ర్యాంకుని పదిలం చేసుకుంటుంది.

జట్ల వివరాలు:
భారత్:
విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్యా రహానే, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేదర్ జాదవ్, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మొహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహల్

ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, స్టోనిస్, హ్యాండ్ స్కాంబ్, మాథ్యూవేడ్, ప్యాట్ కమిన్స్ , కౌల్టర్ నైన్, రిచర్డ్ సన్, ఆడమ్ జంపా

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+