టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఆస్ట్రేలియాపై తొలి మూడు వన్డేల్లోనూ నిరాశపరిచిన శిఖర్ ధావన్ ఆరంభం నుంచే వరుస బౌండరీలతో జోరు అందుకోగా.. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ మొదటి పవర్‌ప్లే ముగిసిన తర్వాత దూకుడుగా ఆడాడు. ఇద్దరూ పోటీపడి మరీ బౌండరీలు బాదడంతో ఒకానొక దశలో భారత్ జట్టు 370పై చిలుకు స్కోరు సాధించేలా కనిపించింది.
95 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్
ఈ క్రమంలో 44 బంతుల్లోనే శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ శర్మ 61 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు. హాఫ్ సెంచరీ అనంతరం ఇద్దరూ మరింత దూకుడుగా ఆడి వన్డేల్లో ఆసీస్‌పై అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. జట్టు స్కోరు 193 పరుగుల వద్ద సిక్స్ కొట్టే ప్రయత్నంలో రోహిత్ శర్మ ఔటై సెంచరీని చేజార్చుకున్నాడు.
వన్డేల్లో 16వ సెంచరీ సాధించిన ధావన్
రోహిత్ శర్మ పెవిలియన్ చేరిన తర్వాత ధావన్ మరింత ధాటిగా ఆడాడు. పేసర్లు, స్పిన్నర్లు అని తేడాలేకుండా.. బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో వన్డేల్లో 16వ సెంచరీ సాధించిన ధావన్(143; 115బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లు) అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అయితే భారత్ స్కోరు 254 పరుగుల వద్ద ధావన్ రెండో వికెట్ ఔటయ్యాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ధావన్ బౌల్డ్ అయ్యాడు.
చివర్లో భారత స్కోరులో తగ్గిన వేగం
ఆ తర్వాత మరో 12 పరుగుల వ్యవధిలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(7) ఔట్ కావడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత లోకేశ్ రాహుల్ (26), రిషభ్ పంత్(36) పెవిలియన్‌కు చేరారు. అనంతరం కేదార్ జాదవ్(10), భువనేశ్వర్‌లు స్వల్ప వ్యవధిలో కూడా ఔట్ కావడంతో భారత్ స్కోరులో వేగం తగ్గింది.
5 వికెట్లు తీసిన కమిన్స్
చివర్లో విజయ్ శంకర్( 26; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. కమిన్స్ వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతికి బుమ్రా సిక్స్ కొట్టడం విశేషం. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ ఐదు వికెట్లు తీసుకోగా, రిచర్డ్‌సన్ మూడు, ఆడమ్ జంపా ఓ వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












