భారత క్రికెటర్ల పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు: ఎంసీజీ ఫ్యాన్స్‌కు కోహ్లీ దిమ్మదిరిగే రిప్లై


హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఆతిథ్య జట్టు అభిమానులు భారత క్రికెటర్లను ఉద్దేశించి జాతి విద్వేష నినాదాలు చేశారు. ఆటలో భాగంగా మూడో రోజైన శుక్రవారం భారత క్రికెటర్లను ఉద్దేశించి మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లోని కొందరు అభిమానులు జాతి వివక్షకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో "మీ వీసాలు చూపించండి" అంటూ ఆసీస్ అభిమానులు పెద్దగా నినాదాలు చేశారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా రంగంలోకి దిగి సదరు అభిమానులకు వార్నింగ్ కూడా ఇచ్చింది. మరోసారి ఇలా చేస్తే శిక్ష తప్పదని పేర్కొంది. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని "పనికిరాని వ్యక్తి" అంటూ నినాదాలు చేశారు. దీనిపై కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు.
కోహ్లీ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందుకు సంబంధించిన ఫోటోని టెలిగ్రాఫ్ స్పోర్ట్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అందులో అభిమానుల నినాదాలను కోహ్లీ వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు తన క్యాప్‌ని తీసి మరీ ఫోజుఇచ్చాడు.

అసలేం జరిగింది?
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 151 పరుగులకే ఆలౌటైంది. దీనిని ఎంతమాత్రం సహించలేని కొందరు ఆసీస్ అభిమానులు భారత క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ సైతం క్రికెట్ ఆస్ట్రేలియా వద్ద ఉంది. ఎంసీజీలోని గ్రేట్ సదర్న్ స్టాండ్‌లో కింద కూర్చున్న కొందరు అభిమానలు 'మీ వీసా చూపెట్టండి' అంటూ భారత క్రికెటర్లను అరవడం కనిపించింది.

'మీ వీసాలు చూపించండి' అన్న నినాదాలు
దీంతో ఈ విషయాన్ని విక్టోరియా పోలీసులు, స్టేడియం మేనేజ్‌మెంట్ దృష్టికి క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకెళ్లింది. అందులో వాటిలో ‘మీ వీసాలు చూపించండి' అని నినాదాలు చేస్తున్నట్టు కనిపించింది. ‘విక్టోరియా పోలీసులు, మైదానం నిర్వాహకులు అభిమానుల ప్రవర్తనను పర్యవేక్షించారు. వారితో చర్చలు జరిపారు. ప్రవేశ నిబంధనల ప్రకారం పద్ధతిగా నడుచుకోవాలని హెచ్చరించారు' అని సీఏ అధికార ప్రతినిధి తెలిపారు.

ప్రవర్తన సరిగా లేకపోతే బయటకు పంపించేస్తాం
ఇప్పటికే ఆ అభిమానులతో అధికారులు మాట్లాడారని, ప్రవర్తన సరిగా లేకపోతే స్టేడియం బయటకు పంపించేస్తామని హెచ్చరించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి వెల్లడించారు. ముఖ్యంగా భారత తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల వద్ద ఔటైనప్పుడు ఇలాగే అసభ్యకరంగా నినాదాలు వినిపించాయి.

2005 బాక్సింగ్ డే టెస్టులో
ఆస్ట్రేలియా జట్టులో పీటర్ హ్యాండ్స్‌కాంబ్ స్థానంలో తుది జట్టులోకి ఎంపికైన మిచెల్ మార్ష్‌ను సైతం అభిమానులు ఇలాగే అవమానించారు. ఎంసీజీలో అభిమానులు విద్వేష వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2005 బాక్సింగ్ డే టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్ ఆండ్రూ నెల్ పట్ల ఇలాగే వ్యవహారించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications