
హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఓటమి నుంచి ఆస్ట్రేలియా జట్టుని వర్షం మాత్రమే కాపాడగలదని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ పేర్కొన్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 27 ఓవర్లలో5 వికెట్లు కోల్పోయి 54 పరుగుల చేసింది.
క్రీజులో మయాంక్ అగర్వాల్ (28), రిషబ్ పంత్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ 346 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆట ముగిసిన అనంతరం మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో "మెల్‌బోర్న్ టెస్టు ఓటమి నుంచి ఆస్ట్ర్లేలియాను వర్షమే కాపాడాలి. ఇండియా ఇప్పుడు డిక్లేర్ చేసిన లక్ష్యాన్ని చేధించడం కష్టం. ఇదొక అద్భుతమైన సిరిస్" అని ట్వీట్ చేశాడు.
బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్‌ను 443/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో పుజారా(106) సెంచరీ సాధించగా విరాట్ కోహ్లీ(82), మయాంక్ అగర్వాల్(76) రోహిత్ శర్మ(63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆతిథ్య జట్టుని 151 పరుగులకే భారత బౌలర్లు ఆలౌట్ చేసింది. ఆతిథ్య జట్టుని ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా.. టీమండియా అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. చివరి రోజు బ్యాటింగ్ కష్టమవుతుందనే ఉద్దేశంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌కు దిగినట్లు తెలుస్తోంది.
అయితే, రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ స్వల్ప వ్యవధిలోనే టాప్ ఆర్డర్‌ను చేజార్చుకుంది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 54 పరుగులు చేసింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కమ్మిన్స్ నాలుగు, హాజెల్ వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.