
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఏకంగా 11 క్యాచ్‌లతో రిషబ్ పంత్ ప్రపంచ రికార్డుని సమం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా, పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని రికార్డును అధిగమించాడు. ఆస్ట్రేలియాతో ఒక ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న భారత వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో షమీ బౌలింగ్‌లో షాన్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో 15 ఔట్లలో పంత్ భాగస్వామ్యమయ్యాడు. తద్వారా ఒక టెస్టు సిరీస్‌లో 14 మంది ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఔట్లలో భాగంగా నిలిచిన భారత కీపర్లు ధోని, వృద్ధిమాన్ సాహా, సయ్యద్ కిర్మాణీలను రికార్డును పంత్ అధిగమించాడు.
ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడు క్యాచ్‌లు అందుకున్న రిషబ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా మరో మూడు క్యాచ్‌లను అందుకున్నాడు. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రిషబ్ పంత్ పట్టిన క్యాచ్‌ల సంఖ్య 17కు చేరింది. ఈ సిరిస్‌లో ఇంకా రెండు టెస్టులను టీమిండియా ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో పలు రికార్డులను రిషబ్ పంత్ అధిగమించే అవకాశం ఉంది.