బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. నేటి నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తలపడనుంది. పింక్ బాల్‌తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది. అడిలైడ్‌లో ఇప్పటివరకు ఏడు డే/నైట్ టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా అన్నింట్లోనూ గెలిచింది.
మరోవైపు భారత్ ఓవరాల్‌గా నాలుగు పింక్ బాల్ టెస్టులు ఆడగా మూడింట్లో నెగ్గింది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంకపై విజయం సాధించింది. అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో ఆడిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ పోరులోనే 36 పరుగులకే కుప్పకూలి క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది. నేటి మ్యాచ్‌తో ఈ చేదు జ్ఞాపకాలను చెరిపేయాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని ఆసక్తికరంగా మారింది. మిడిలార్డర్‌లో వస్తానని హిట్ మ్యాన్ స్పష్టం చేసినప్పటికీ, 5 లేదా 6వ స్థానాల్లో వస్తాడా అనేది ఆసక్తికరం. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు రోహిత్ దూరమైన సంగ తి తెలిసిందే. ఇక పిచ్ సమతూకంగా ఉంటుందని క్యురేటర్ డామియన్ హో తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌కు సహకారం లభిస్తుందని అన్నాడు. అయితే అడిలైడ్ పిచ్ సాధారణంగా పేసర్లకు అనుకూలంగా ఉంటుంది.
కాగా, పిచ్ మూడో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. గతంలో అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టుల్లో స్పిన్నర్లూ సత్తాచాటారు. 47 వికెట్లు పడగొట్టారు. ఇందులో నాథన్ లైయన్ 28 వికెట్లు సాధించాడు. ఇక టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంటుంది. మరోవైపు తొలి రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలూ ఎక్కువగా ఉన్నాయి. ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రెండో రోజు ఆట మధ్యలోనూ వరుణుడు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే తొలి ఆట పూర్తిగా కోల్పోయే అవకాశాలు తక్కువ.