India vs Australia 2nd ODI Highlights: రెండో వన్డేలో భారత్ విజయం


హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియానే 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 251 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా... బుమ్రా, విజయ్ శంకర్ చెరో రెండు వికెట్లు... రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. రెండో వన్డేలో విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది.
స్టోయినిస్ హాఫ్ సెంచరీ
ఆస్ట్రేలియా జట్టులో పీటర్ హ్యాండ్స్ కోంబ్(48), స్టోయినిస్(52), ఖవాజా(38), అరోన్ ఫించ్(37)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. చివరి ఆరు ఓవర్లో ఆసీస్ విజయానికి 38 పరుగులు అవసరం కాగా చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. దీంతో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే, ఈ సమయంలో విజృంభించిన భారత బౌలర్లు వరుసగా వికెట్లు కూల్చి టీమిండియాకు విజయాన్ని అందించారు.
చివరి ఓవర్‌లో 11 పరుగులు
చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన విజయ్ శంకర్ 2 పరుగులిచ్చి స్టోయినిస్ (52), ఆడమ్ జంపా (2)ను పెవిలియన్‌కు చేర్చాడు. దీతో ఆస్ట్రేలియా జట్టు 242 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది.
రోహిత్ డకౌట్
ఓపెనర్ రోహిత్ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో భారత జట్టు పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీతో కలిసి శిఖర్ ధావన్ స్కోరు బోర్డుని నడిపించాడు. వీరిద్దరూ 38 పరుగుల జత చేసిన తర్వాత ధావన్(21) రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ధావన్ ఎల్బీగా ఔటయ్యాడు.
విజయ్ శంకర్ రనౌట్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడుతో కలిసి కోహ్లీ మరో 37 పరుగులు జత చేశాడు. అనంతరం అంబటి రాయుడు(18) మూడో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. లయాన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ రాయుడు చేరాడు. ఈ దశలో కోహ్లీతో కలిసి విజయ్ శంకర్ నిలకడగా స్కోర్ పెంచుకుంటూ పోయాడు. కానీ దురదృష్టవశాత్తు ఆడం జంపా వేసిన 29వ ఓవర్ ఐదో బంతికి శంకర్(46) నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ అయ్యాడు.
వరుస బంతుల్లో ధోని, కేదార్ జాదవ్ ఔట్
ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కేదార్ జాదవ్(11), ధోనీ(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లీ స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. అంతకుముందు 55 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరిన కోహ్లీ దానిని సెంచరీగా మలచుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 40 సెంచరీ కావడం విశేషం.
250 పరుగులకు ఆలౌటైన టీమిండియా
అయితే కాగా ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో జడేజా(21) ఖవాజాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కొంత సమయానికే కోహ్లీ(116) భారీ షాట్‌కు ప్రయత్నించి స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 248 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది. మరొక పరుగు వ్యవధిలో కుల్దీప్ యాదవ్(3) నిష్క్రమించాడు. ఇక చివరి వికెట్‌గా బుమ్రా డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో భారత్ 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications