
సిడ్నీ: తొలి వన్డే ఓటమితో సిరీస్‌లో వెనుకబడిన భారత జట్టు ఇప్పుడు రేసులో నిలిచే పనిలో పడింది. మరికొద్ది సేపట్లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న రెండో వన్డేలో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫించ్ సేన ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన మార్కస్ స్టోయినీస్ స్థానంలో మొయిసెస్ హెన్రిక్స్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు కోహ్లీసేన తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన ఆరోన్ ఫించ్ టీమ్ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. తొలి వన్డేకు ప్రతీకారంగా కోహ్లీసేన ఈరోజు గెలుపొందాలని భావిస్తోంది. ఒకవేళ టీమిండియా గెలిస్తే.. సిరీస్ సమంగా మారుతుంది. ఓడితే మాత్రం ఆసీస్ సిరీస్ గెలుపొందుతుంది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఆడనుందో వేచి చూడాలి. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 250వ వన్డే మ్యాచ్ కావడం విశేషం.
మొదటి వన్డేలో టీమిండియాలో ఆరో బౌలర్ లేని స్పష్టంగా కనిపించింది. స్పిన్నర్ చహల్, పేసర్ సైనీ భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. అయినప్పటికీ కోహ్లీ తుది జట్టులో మార్పులు చేయకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెత్త రికార్డును కోహ్లీ సమం చేస్తాడు. భారత జట్టు వరుసగా ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఓడటం గత 9 ఏళ్లలో ఇదే ప్రథమం.
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, నవ్‌దీప్ సైనీ.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మొయిసెస్ హెన్రిక్స్, మార్నస్ లబుషేన్, ఆలెక్స్ క్యారీ, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ఆడం జంపా.