హైదరాబాద్: వరుస విజయాలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును చిన్న గాయం ఆందోళనకు గురి చేసింది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 రాంచీ వేదికగా శనివారం జరగనుంది.
తొలి టీ20 కోసం సన్నద్ధమయ్యే క్రమంలో రాంచీలో గురువారం నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ భుజానికి గాయమైంది. దీంతో వెంటనే స్మిత్‌ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు జరిపించారు. పనిలో పనిగా ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ కూడా చేయించారు.

అనంతరం పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎటువంటి సమస్యలేదని, స్టీవ్ స్మిత్ ఫిట్‌గా ఉన్నాడని తొలి టీ20లో పాల్గొనచ్చని వైద్యులు చెప్పడంతో జట్టు మేనేజ్‌మెంట్ ఊపిరిపీల్చుకుంది. దీంతో ఆస్ట్రేలియా బృందంలో నెలకొన్న ఆందోళన తొలగిపోయింది.
ఇప్పటికే 4-1 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన స్మిత్ సేన టీ20 సిరిస్‌నైనా చేజిక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అంతేకాదు ఆస్ట్రేలియా టీ20 జట్టులో ఇప్పటికే పలు మార్పులు చేసింది. ఇరు జట్ల మధ్య శనివారం తొలి టీ20 రాంచీ వేదికగా జరగనుంది.