భారత్ చెత్త రికార్డు: 11 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిందిలా
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో పూణె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓ చెత్త రికార్డున మూటగట్టుకుంది. కేవలం 11 పరుగుల వ్యవధిలో టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయింది. ఇప్పటి వరకు టెస్టు చరిత్రలో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శన ఇదే కావడం విశేషం.
భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్(64) తప్ప ఏ ఒక్క ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. కెప్టెన్ కోహ్లీ విషయానికి వస్తే ఈ మ్యాచ్ రెండో బంతికే డకౌటయ్యాడు. 104 ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఇందులో టెస్టులు, వన్డేలు, టీ20లు కూడా ఉన్నాయి.
చివరిసారిగా విరాట్ కోహ్లీ 2014లో కార్డిఫ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో డకౌటయ్యాడు. అతని టెస్ట్ కెరీర్ మొత్తంలో ఇది ఐదో డకౌట్ కాగా.. సొంతగడ్డపై ఇదే తొలి డకౌట్ కావడం విశేషం. ఇక ఆస్ట్రేలియా జట్టుపై రెండో డకౌట్. ఆస్ట్రేలియా స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ అద్భుత ప్రదర్శన చేశాడు.
13.1 ఓవర్లు వేసిన ఒకీఫీ అత్యధికంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 94 పరుగుల వద్ద రాహుల్ ఔటవ్వడంతో ఇక ఆ తర్వాత ఆటగాళ్లు క్యూ కట్టారు. రహానె, సాహా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, జడేజా, ఉమేశ్ యాదవ్ వికెట్లను భారత్ వెంటవెంటనే కోల్పోయింది.
దీంతో భారత జట్టు 40.1 ఓవర్లలో కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. 11 పరుగుల వ్యవధిలో భారత జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది. ఇంతటి చెత్త ప్రదర్శనను టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా గతంలో ఎన్నడూ చేయలేదు. గతంలో 1989-90 మధ్య క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన టెస్టులో భారత్ 18 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయింది.
11 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిందిలా:

ఓవర్ 32.2
64 పరుగులతో ఆడుతున్న రాహుల్.. ఒకీఫీ వేసిన ఓవర్ పిచ్ బంతిని భారీ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తాకడంతో లాంగాన్‌లో వార్నర్ చేతికి చిక్కాడు. రహానే, రాహుల్ నాలుగో వికెట్‌కు 50 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సమయంలో భారత స్కోరు 94/4గా ఉంది.

ఓవర్ 32.4
తనపైకి నేరుగా దూసుకొచ్చిన బంతి అజ్యింకె రహానే 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాట్ ఎడ్జ్‌ను తాకి చాలా తక్కువ ఎత్తులో స్లిప్‌లోకి వెళ్లింది. రెండో స్లిప్‌లో హ్యాండ్స్‌కాంబ్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. దీంతో టీమిండియా టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఈ సమయంలో భారత స్కోరు 95/5గా ఉంది.

ఓవర్ 32.6
మిడిల్ పిచ్‌లో పడ్డ బంతి వికెట్ల మీది నుంచి వెళ్లే క్రమంలో అనూహ్యంగా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బ్యాట్‌ను తాకి ఫస్ట్ స్లిప్‌లో స్మిత్ చేతిలోకి వెళ్లింది. దీంతో సాహా డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో భారత స్కోరు 95/6గా ఉంది.

ఓవర్ 33.3
ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ వేసిన ఫుల్ డెలివరిని డిఫెన్స్ చేసే క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ (1) ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఉన్న హ్యాండ్స్ కాంబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో భారత స్కోరు 95/7గా ఉంది.

ఓవర్ 36.3
ఆసీస్ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫీ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని జయంత్ యాదవ్ (2) ముందుకొచ్చి ఆడాడు. కానీ బంతి మిస్‌కావడం, వేడ్ వికెట్లను తాకడంతో, జయంత్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది. ఈ సమయంలో భారత స్కోరు 98/8గా ఉంది.

ఓవర్ 38.2
ఆ తర్వాతి ఓవర్‌లో స్టీవ్ ఒకీఫ్ వేసిన బంతిని ముందుకొచ్చి జడేజా (2) షాట్ కొట్టాడు. కానీ బంతి డీప్ మిడ్‌వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో టీమిండియా తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. ఈ సమయంలో భారత స్కోరు 101/9గా ఉంది.

ఓవర్ 40.1
స్టీవ్ ఒకీఫీ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఉమేశ్ యాదవ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా 40.1 ఓవర్లలో కేవలం 105 పరుగులకే కుప్పకూలింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications