దినేశ్ కార్తీక్ గనుక చివరి ఓవర్
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ గనుక చివరి ఓవర్ వరకు ఉండి ఉంటే భారత్ తప్పక విజయం సాధించి ఉండేదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి 4 ఓవర్లలో 60 పరుగులు కావాలి. ఈ దశలో టీమిండియా గెలుపు కష్టమేనని అంతా భావించారు. అయితే, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్.. టై వేసిన 14వ ఓవర్లో చెలరేగిపోవడంతో ఒక్కసారిగా మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. తొలి రెండు బంతులకు పంత్ 6, 4 బాదగా... చివరి రెండు బంతులకు కార్తీక్ 4, 6 కొట్టాడు. దీంతో ఒకే ఓవర్‌లో 25 పరుగులు రావడంతో మ్యాచ్ సమీకరణం 3 ఓవర్లలో 35గా మారింది.

దూకుడుగా ఆడిన పంత్, దినేశ్ కార్తీక్
దీంతో భారత్ విజయం సాధించడం ఖాయమని అంతా ఓ అంచనాకు వచ్చారు. ఆ తర్వాత పంత్, దినేశ్ కార్తీక్ మరింత దూకుడగా ఆడటంతో భారత్ విజయానికి 10 బంతుల్లో 18 పరుగులు చేయాలి. కార్తీక్, పంత్ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో భారత్ సులువగా గెలిచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ రిషబ్ పంత్ ఆడిన ఒక షాట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆండ్రూ టై బౌలింగ్‌లో రివర్స్ హిట్ ఆడగా.. బంతి పాయింట్‌లో గాల్లోకి లేచి క్యాచ్‌గా ఔటయ్యాడు. తర్వాతి రెండు బంతుల్లో ఒక్క పరుగే వచ్చింది.

6 బంతుల్లో 13 పరుగులుగా భారత్ సమీకరణం
చివరి బంతికి కార్తీక్ ఫోర్ బాదడంతో సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారింది. చివరి ఓవర్ వేసిన ఆసీస్ బౌలర్ మార్కస్ స్టోయినిస్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్ తొలి రెండు బంతుల్లో 2 పరుగులే వచ్చాయి. తర్వాతి 2 బంతులకు కృనాల్ (2), కార్తీక్ (30) ఔట్ కావడంతో మ్యాచ్ ఆసీస్ వైపు తిరిగింది. ఛేదన అత్యంత ఉత్కంఠకరంగా సాగినప్పటికీ, వరుస బంతుల్లో కృనాల్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఔట్ కావడంతో భారత ఓటమి తప్పలేదు.

రెండు క్యాచ్‌లు జారవిడిచిన భారత ఫీల్డర్లు
ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు జారవిడచడంతో ఆసీస్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. "బ్యాటింగ్‌లో ఆరంభం బాగానే ఉంది. మిడిల్ ఓవర్లలోనే తడబడ్డాం. పంత్, కార్తీక్ క్రీజులో ఉండడంతో చివర్లో గెలుస్తామనుకున్నాం. పంత్ ఔటవ్వడంతో అంతా మారిపోయింది" అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 17 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

మూడు టీ20ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన ఆసీస్
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ని 17 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 శుక్రవారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది.


Click it and Unblock the Notifications












