
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 18 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
మహమ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడిన్ ఓవర్ వేశాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసిన బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్‌ను మూడో బంతికే పెవిలియన్ చేర్చాడు. బుమ్రా బంతిని ఫించ్ షాట్ ఆడబోగా బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయి ధోనీ చేతిలో పడింది.
దీంతో ఆస్ట్రేలియా పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనర్ మార్కస్ స్టోయినిస్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం స్టోయినీస్(30), ఖవాజా(43) పరుగులతో క్రీజులో ఉన్నారు.