
ముంబై: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ముంబై వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్-2019 లీగ్ దశలో ఎదురుపడ్డ తర్వాత రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే.. రెండు జట్లలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు ఎంతో పటిష్ఠంగా ఉన్నాయి.
కీలకమైన ఆస్ట్రేలియాతో పోరుకు టీమిండియా కూడా సరైన ప్రణాళికలతో సిద్ధమైంది. బలమైన బ్యాటింగ్ లైనప్, పటిష్ట బౌలింగ్ దళంతో బరిలోకి దిగనుంది. అయితే ఇటీవల పునరాగమనం చేసిన భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై అందరి దృషి ఉంది. ఇక యువ పేసర్ నవదీప్ సైనీ కూడా ఎదుర్కోవడం ఆసీస్ ఆటగాళ్లకు సవాలే. బూమ్రా, సైనీ తమ బౌలింగ్‌కు మరింత పదును పెట్టే ప్రయత్నంలో ఉన్నారు.
ఆసీస్ ఆటగాళ్లను బోల్తా కొట్టించేందుకు బుమ్రా, సైనీలు ఇద్దరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. వికెట్లు ముందు 'షూ'ని ఉంచి మరి యార్కర్ల ప్రాక్టీస్ చేశారు. బుమ్రా యార్కర్లు సంధిస్తూ వికెట్లను కూల్చాడు. మరోవైపు టాస్ బంతులతో షూను కూడా పడగొట్టాడు. ఇక సైనీ కూడా ఇదేవిధంగా ప్రాక్టీస్ చేసాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బుమ్రా, సైనీలు సంధిస్తున్న బంతుల్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆస్ట్రేలియాకు హెచ్చరిక జారీ చేస్తున్నారని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
తొలి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ముగ్గురు పసర్లతో బరిలోకి దిగనున్నాడు. బుమ్రా జట్టులో ఖాయం. బ్యాటింగ్‌లో కూడా ఉపయోగపడే అవకాశం ఉండటంతో శార్దుల్ చోటుకు ఢోకా లేకుండా పోయింది. వీరికి తోడుగా మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీలలో ఒకరికే అవకాశం దక్కవచ్చు. సైనీ సాధన, ఇటీవలి అతని ప్రదర్శనను చూస్తే జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కోహ్లీ ఎవరికీ ఓటేస్తాడో చూడాలి.
భారత్ తుది జట్టు (అంచనా):
ధావన్, రోహిత్, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్, జాదవ్, జడేజా, శార్దూల్, కుల్‌దీప్, షమీ/సైనీ, బుమ్రా.