తొలి వన్డే పాండ్యా, ధోని షో మాత్రమే: మ్యాచ్ హైలెట్స్ (ఫోటోలు)
హైదరాబాద్: చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. వర్షం అడ్డంకి మారిన ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 26 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరిస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
హార్దిక్ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. వర్షం అడ్డంకిగా మారడంతో ఆసీస్ లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా నిర్ధారించారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్
అయితే ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన పాండ్య ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. రెండో వన్డే గురువారం (సెప్టెంబర్ 21) కోల్‌కతాలో జరుగుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత ఇన్నింగ్స్ మొదలైన తీరు చూస్తే.. చివరికి 200 చేసినా గొప్పే అనిపించింది. 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, కేదార్ జాదవ్ నిలకడగా ఆడటంతో కుదురుకున్నట్లు అనిపించింది.

87 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకున్న భారత్
అయితే ఆ తర్వాత మళ్లీ తడబడి 87 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ధోని, పాండ్యాలు అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు చివరి ఓవర్లలో ధోని చెలరేగి ఆడటంతో జట్టుకు ఊహించని స్కోరు అందించాడు. బౌలర్ భువీ (32; 30 బంతుల్లో 5 ఫోర్లు)తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

పాండ్యా అద్భుతమైన ఇన్నింగ్స్
నిజానికి ఆదివారం నాటి వన్డేలో పాండ్యా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అతడి ఇన్నింగ్సే ఆటను మలుపు తిప్పింది. ఆరంభంలో కొంచెం నెమ్మదిగా ఆడిన పాండ్యా.. ఆ తర్వాత చెలరేగాడు.
తనదైన శైలిలో హిట్టింగ్ చేసి ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు.

118 పరుగులు జోడించిన పాండ్యా, ధోనిల జోడీ
ఇక, ధోని క్రీజులో పాతుకుపోవడంతో పాండ్యా స్వేచ్ఛగా ఆడే అవకాశం లభించింది. తొలి 45 బంతుల్లో 34 పరుగులే చేసిన పాండ్యా.. తర్వాతి 21 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. ధోని, పాండ్యాలు 118 పరుగులు జోడిస్తే.. అందులో పాండ్యా సాధించిన పరుగులు 83.

పాండ్యా అవుటైన తర్వాత చెలరేగిన ధోని
పాండ్యా ఉన్నంత వరకు 62 బంతుల్లో ధోని 37 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క బౌండరీ కూడా లేదు. కానీ పాండ్యా అవుటైన తర్వాత ధోని తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 26 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. ఇటీవలే శ్రీలంకలో ధోనితో కలిసి మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన భువీ తొలి వన్డేలో కీలక ఇన్నింగ్సా ఆడాడు. దీంతో భారత్ చివరి 5 ఓవర్లలో 53 పరుగులు చేసింది.

ధోని మరో మైలురాయి
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోని (79: 88 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తన అంతర్జాతీయ కెరీర్‌లో ధోని వందో హాఫ్ సెంచరీని పూర్తి నమోదు చేశాడు. టెస్టుల్లో 66 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 33, టీ20ల్లో ఒక హాఫ్ సెంచరీతో ధోని ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

నాలుగో స్ధానంలో ధోని
అంతర్జాతీయ కెరీర్‌లో ఇలా వందో హాఫ్ సెంచరీ అందుకున్న భారత క్రికెటర్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 164 హాఫ్ సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో రాహుల్ ద్రవిడ్(146), సౌరవ్ గంగూలీలు(107) ఉండగా... వీరి తర్వాత ధోని నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక, ధోని వన్డేల్లో చివరగా అవుటవ్వడానికి... ఆదివారం అవుటవడానికి మధ్యలో చేసిన పరుగులు 241. శ్రీలంకలో అతనాడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నాటౌట్‌గానే నిలిచాడు. తన చివరి 9 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ధోని రెండుసార్లే అవుట్ కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications