రవీంద్ర జడేజా క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్: ఫ్లయింగ్ బర్డ్..కానీ: హార్డ్ లక్

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఎట్టకేలకు బౌన్స్ బ్యాక్ అయింది. వరుసగా రెండు ఘోర పరాజయాల తరువాత.. తొలి విజయాన్ని అందుకుంది. మంగళవారం రాత్రి అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా ఏ జట్టూ చేయలేని 211 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఛేజింగ్‌కు దిగిన ఆఫ్ఘన్‌ను 144 పరుగుల వద్దే కట్టడి చేసింది.
సునామీ ఇన్నింగ్..
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. కసి తీరా ఆడారు. కరవు తీరేలా షాట్లను బాది అవతల పడేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల భరతం పట్టారు. మునుపటి ఫామ్‌ను అందుకున్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చిచ్చరపిడుగుల్లా ఆడారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 140 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ 47 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, ఎనిమిది బౌండరీలు ఉన్నాయి. రోహిత్‌తో పోటీ పడి షాట్లు కొట్టాడు రాహుల్. 48 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 69 పరుగులు చేశాడు.
కొనసాగింపుగా..
వారిద్దరూ అవుట్ అయిన తరువాత క్రీజ్‌లోకి దిగిన రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య కూడా అదే స్థాయిలో చెలరేగారు. తలా ఓ 13 బంతులను ఆడిన పంత్, పాండ్యా కలిసి 62 పరుగులను పిండుకున్నాడు. 13 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో రిషభ్ పంత్ 27, అదే 13 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో పాండ్యా 35 పరుగులు చేశారు. దీనితో జట్టు స్కోరు 200 ల్యాండ్ మార్క్‌ను దాటింది. 210 పరుగుల వద్ద నిలిచింది.
ఛేజింగ్ దిగి.. చతికిల పడి
కొండంత లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ తీరు ఫర్వాలేదనిపించేలా సాగింది. ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ.. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు నిలదొక్కుకున్నారు. ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారు. కేప్టెన్ మహ్మద్ నబీ, కరీం జన్నత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించారు. కరీం జన్నత్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 22 బంతుల్లో 42 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్‌లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. మహ్మద్ నబీ 32 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
జడేజా అద్బుతమైన క్యాచ్ పట్టినా..
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అది నాటౌట్‌గా మిగిలింది. కరీం జన్నత్ కొట్టిన షాట్. దాన్ని డైవ్ చేసి మరీ అందుకున్నాడు. ఫ్లయింగ్ బర్డ్‌లా క్యాచ్ పట్టాడు. 19వ ఓవర్‌లో ఈ స్టన్నింగ్ సీన్ సాక్షాత్కరించింది. మహ్మద్ షమీ సంధించిన ఓవర్ అది. తొలి బంతికి కరీం జన్నత్ భారీ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి మిడాన్ దిశగా
గాల్లోకి లేచింది. దాన్ని డైవ్ చేసి అందుకున్నాడు జడేజా. అప్పటికి కరీం వ్యక్తిగత స్కోరు 26 పరుగులు.
నాటౌట్‌గా తేల్చిన థర్డ్ అంపైర్..
ఈ క్యాచ్‌ను ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేశారు. గాల్లో ఉండగానే వేళ్ల కొసలతో బంతిని అందుకున్న జడేజా.. దాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోలేకపోయాడు. బంతితో పాటు కిందపడ్డాడు. ఆ సమయంలో బంతిని గ్రౌండ్‌ను తాకింది. గాల్లో ఉన్న సమయంలో అతని చేతుల్లోనే ఉన్నప్పటికీ.. దాన్ని క్యాచ్‌గా పరిగణించలేదు థర్డ్ అంపైర్. బంతి నేలను తాకడాన్ని కౌంట్‌లోకి తీసుకున్నాడు. నాటౌట్‌గా తేల్చాడు. దీనితో క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా మిగిలిపోవాల్సిన జడేజా శ్రమ వృధా అయింది.
నెటిజన్లు ఫైర్..
థర్డ్ అంపైర్ డెసిషన్ పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తొండాట ఆడాడంటూ నిప్పులు చెరుగుతున్నారు. జడేజా సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నాటౌట్‌గా ప్రకటించడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అంపైర్ల తప్పుడు నిర్ణయాలు జట్టును తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయని మండిపడుతున్నారు. దాని తరువాత కరీం.. మరిన్ని భారీ షాట్లు ఆడాడు. తన వ్యక్తిగత స్కోరును 26 నుంచి 42కు పెంచుకున్నాడు. నాటౌట్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications