

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అప్ఘనిస్థాన్ ఓపెనర్ మహ్మద్ షెహ్‌జాద్ వేగంగా హాఫ్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న షెహజాద్ కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 50 పరుగులు సాధించాడు.
ఈ టోర్నీలో అతడికిది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన షెహజాద్ దూకుడుగా ఆడుతున్నాడు. తాత్కాలిక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, వరుసగా బౌలర్లని మార్చినా ఫలితం లేకపోయింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ స్కోరు బోర్డు మెరుపు వేగంతో దూసుకెళ్తోంది.
హెహజాద్ వ్యక్తిగత స్కోరు 49 వద్ద ఇచ్చిన క్యాచ్‌ను రాయుడు జారవిడిచాడు. దీంతో తనకు వచ్చిన లైఫ్‌ని హెహజాద్ చక్కగా వినియోగించుకున్నాడు. ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో ఆప్ఘనిస్థాన్ వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది.
ఓపెనర్ జావెద్ అహ్మది (5) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.
జడేజా వేసిన ఇన్నింగ్స్ 12.4వ బంతిని ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా (3) జడేజా బౌలింగ్‌లోనే బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హష్మతుల్లా షాహిది డకౌట్‌గా వెనుదిరగగా, కెప్టెన్ ఆస్గర్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఈ ఇద్దరినీ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపడం విశేషం. ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతికి షాహిదీ.. మూడో బంతికి అస్గర్‌లను ఒక్క పరుగు కూడా చేయనీకుండానే పెవిలియన్‌కు చేర్చి ఆప్ఘన్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ రెండు సూపర్ స్టంపింగ్‌లతో అలరించాడు.
అయితే ఓపెనర్ షెహజాద్ (94; 76 బంతుల్లో) మాత్రం రెచ్చిపోయి ఆడుతున్నాడు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న అప్ఘనిస్థాన్ జట్టు 21 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షెహజాద్ (94), గులాబ్దీన్ నైబ్(3) పరుగులతో ఉన్నారు.