హైదరాబాద్: స్వదేశంలో కివీస్‌తో పరిమిత ఓవర్ల సిరిస్ అనంతరం శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మూడు టెస్టుల సిరీస్‌కు గాను తొలి రెండు టెస్టులకు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. నవంబర్ 16 నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ మొదలు కానుంది.
శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరిస్ కోసం ఓపెనర్ మురళీ విజయ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సమయంలో మురళీ విజయ్‌కు గాయమైంది. గాయం కారణంగా శ్రీలంకతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో మురళీ విజయ్ ఆడలేదు.
సుదీర్ఘ విరామం తర్వాత మురళీ విజయ్ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. మరోవైపు ఛటేశ్వర పుజారా, మురళీ విజయ్‌లు తిరిగి చోటు దక్కించుకోగా, టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు చోటు దక్కింది. గత కొన్నాళ్లుగా జట్టుకు దూరమైన ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు.
ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆడిన ఇషాంత్ శర్మకు జట్టులో చోటు దక్కింది. ఇదిలా ఉంటే శ్రీలంకతో టెస్టు సిరిస్‌కు జట్టు కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్‌గా రహానే కొనసాగనున్నాడు. కుల్దీప్ యాదవ్ మూడో స్పిన్నర్ గా జట్టులో కొనసాగనున్నాడు.
శ్రీలంకతో రెండు టెస్టులకు టీమిండియా:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఛటేశ్వర పుజారా, రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, మహమ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ.