హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా నవంబర్ 1 జరగనున్న తొలి టీ20పై వాతావరణ కాలుష్యం ప్రభావం పడింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు అక్టోబరు 17 నుంచి 2018 మార్చి 15 వరకు ఢిల్లీలో డీజిల్ జనరేటర్ల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం టీ20 మ్యాచ్‌పై ప్రభావం చూపనుంది. బుధవారం (నవంబర్ 1) రాత్రి ఏడు గంటలకు ఫ్లడ్‌లైట్స్ వెలుగులో మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. రాత్రి మ్యాచ్ కావడంతో నిరంతర విద్యుత్తు కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) ఐదు డీజిల్ జనరేటర్లను సిద్ధం చేస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న కాలుష్య నియంత్రణ బోర్డు(ఈపీసీఏ) డీడీసీఏకు లేఖ రాసింది. మ్యాచ్‌కు డీజిల్ జనరేటర్లు వాడొద్దని, వేరే ప్రత్నామ్నాయాలు చూసుకోవాలని ఆ లేఖలో పేర్కొంది. దీంతో ఢిల్లీ విద్యుత్తు బోర్డు, డిస్కం అధికారులతో డీడీసీఏ నిర్వాహకులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా నిరంతర విద్యుత్తు కోసం మ్యాచ్ జరిగేంతవరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు ఢిల్లీ విద్యుత్తు బోర్డు ముందుకు వచ్చింది.