హాట్ కేకుల్లా అమ్ముడైన భారత్-ఆసీస్ తొలి వన్డే టికెట్లు

Posted By:

హైదరాబాద్: ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే చెన్నైకి చేరుకుంది. సెప్టెంబర్ 17న జరిగే తొలి వన్డేతో ఈ సిరిస్ ఆరంభం కానుంది. తొలి వన్డేకి ఆతిథ్యమిస్తున్న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఏర్పాట్లను ఇప్పటికే నిర్వహకులు పూర్తి చేశారు.

హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

శ్రీలంక పర్యటన తర్వాత కోహ్లీసేన ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న సిరిస్ కావడంతో భారత క్రికెట్ అభిమానులు ఈ సిరిస్ కోసం వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. తొలి వన్డేకు సంబంధించిన టికెట్లను సెప్టెంబర్ 10వ తేదీన తమిళ క్రికెట్ అసోసియేషన్ అమ్మకానిక ఉంచగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

జీఎస్టీ, వినోద ప‌న్నుల‌తో కలిపి

జీఎస్టీ, వినోద ప‌న్నుల‌తో కలిపి మొత్తం ఏడు ధరల్లో టికెట్లను విక్ర‌యించారు. 38వేల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ మైదానంలో మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక సీటింగ్‌ వ్యవస్థ ఉంది. మ్యాచ్ జరుగుతున్న సెప్టెంబర్ 17 ఆదివారం కావడంతో టికెట్లు అనుకున్న సమయం కంటే ముందుగానే అమ్ముడైనట్లు నిర్వహకులు తెలిపారు.

ఇరు జట్లు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌

వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేన ఈ సిరిస్‌ను కూడా కైవసం చేసుకుంటుందని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఇక, అభిమానులు కూడా ఇదే భావనతో ఉన్నారు. ఇరు జట్ల పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉండటంతో ఈ వన్డేలో పరుగుల వరద ఖాయమని స్టేడియం నిర్వాహకులు అంటున్నారు.

ఐసీసీ ర్యాంకుల్లో ఇలా

ఇక, ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే ఆస్ట్రేలియా 117 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉండ‌గా టీమిండియా కూడా 117 పాయింట్లతో మూడ‌వ స్థానంలో కొనసాగుతోంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డే సెప్టెంబర్ 17న చెన్నై వేదికగా జరగనుంది. ఈ వన్డే సిరిస్ అనంతరం ఆతిథ్య భారత్‌తో ఆసీస్ మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.

Story first published: Friday, September 15, 2017, 12:39 [IST]
Other articles published on Sep 15, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి