అండర్ 19 ఆసియా కప్- 2024లో సంచలన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వరుసగా నిరాశపరుస్తున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగుకే వెనుదిరిగిన ఈ 13 ఏళ్ల బిహార్ కుర్రాడు మరోసారి తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. షార్జా వేదికగా జపాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 23 బంతుల్లో 23 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు. అతనితో పాటు ఇన్నింగ్స్ ఆరంభించిన మరో ఓపెనర్ అయుష్ దుమ్మురేపాడు.
ఆయుష్ 29 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగాడు. కాగా, పాక్‌తో మ్యాచ్‌లో వైభవ్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేశాడు. అయితే మెరుగైన పాక్ బౌలింగ్ ముందు విఫలమైన ఈ కుర్రాడు జపాన్ బౌలర్లపై సత్తాచాటుతాడని భావించారంతా. కానీ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ పసికూన జట్టుపై అంచనాలను అందుకోలేకపోయాడు. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్నవయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ ఇటీవల చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

భారత క్రికెట్‌లోనే సెన్సేషన్‌గా మారిన ఈ కుర్రాడి కోసం మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. అంతిమంగా రాజస్థాన్ రూ. కోటీ 10 లక్షలు వెచ్చించి వైభవ్‌ను సొంతం చేసుకుంది. 13 ఏళ్ల 243 రోజు వయసు ఉన్న వైభవ్‌ను రాజస్థాన్ తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ భారీ అంచనాల మధ్య ఆసియా కప్‌లో బరిలోకి దిగాడు. కానీ వరుస మ్యాచ్‌ల్లో సత్తాచాటలేకపోయాడు.
కాగా, జపాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యువ భారత్ 14 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ అమన్ (5 నాటౌట్; 9 బంతుల్లో), సిద్ధార్థ్ (13 బ్యాటింగ్; 23 బంతుల్లో, 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. దుబాయ్ వేదికగా శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 43 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. పాకిస్థాన్ 50 ఓవర్లకు ఏడు వికెట్లకు 281 పరుగులు చేసింది. ఛేదనలో ఇండియా 47.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, జపాన్, యూఏఈ ఉన్నాయి.