పాట్నా: భారత అండర్-19 జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. భారత అండర్-19 కెప్టెన్ ఇషాన్ కిషన్‌పై దాడి జరిగింది. ఇషాన్ తన కారుతో ఓ ఆటోను ఢీకొట్టాడు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రహించిన స్థానికులు అతనిపై దాడి చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇషాన్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో మంగళవారం చోటు చేసుకుంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కిషన్ తన తండ్రి కారును అతి వేగంగా నడుపుతున్నాడు. ఈ క్రమంలో ముందున్న ఓ ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటోలోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు కిషన్‌తో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని కిషన్ తోపాటు అతనిపై దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు కెప్టెన్‌గా కిషన్ ఎంపికైన విషయం తెలిసిందే. జనవరిలోనే బంగ్లాదేశ్‍లో ఈ టోర్నీ జరగనుంది. అండర్-19 జట్టుకు భారత మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉన్నారు.
భారత్ తోపాటు ఐర్లాండ్, న్యూజిలాండ్, నేపాల్ జట్లు ఏ గ్రూపులో ఉన్నాయి. జనవరి 28న ఐర్లాండ్ జట్టుతో భారత్ తలపడనుంది. జార్ఖండ్ తరపున కిషన్ కెప్టెన్, బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ఆడాడు.