హైదరాబాద్: న్యూజిలాండ్-ఏతో నాలుగు రోజుల అనధికారిక టెస్టు సిరీస్‌ను భారత్-ఏ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 'డ్రా'తో గట్టెక్కాలనుకున్నప్పటికీ భారత బౌలర్లు చెలరేగారు. దీని ఫలితంగా రెండో టెస్టులో భారత్-ఏ జట్టు ఇన్నింగ్స్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఓవర్‌నైట్ స్కోరు 104/1తో నాలుగో రోజైన మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొన సాగించిన న్యూజిలాండ్-ఏ జట్టు 79.3 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు కరణ్ శర్మ (5/78), షాబాజ్ నదీమ్ (4/41) కివీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. మరో వికెట్ పేసర్ శార్దుల్ ఠాకూర్‌కు దక్కింది.

దీంతో నాలుగో రోజు న్యూజిలాండ్-ఏ జట్టు మరో 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకానొక దశలో 158/2తో పటిష్టంగానే కనిపించిన ఆస్ట్రేలియా-ఏ జట్టు ఆ తర్వాత భారత స్పిన్నర్ల ధాటికి మిగతా ఎనిమిది వికెట్లను 52 పరుగుల తేడాతో కోల్పోయింది.
కెప్టెన్ హెన్రీ నికోల్స్ (190 బంతుల్లో 94; 11 ఫోర్లు, ఒక సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. విల్‌యంగ్ (14), కొలిన్ మన్రో (13), టిమ్ సెఫెర్ట్ (9), కుజెలిన్ (7) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్-ఏ 211, భారత్-ఏ 447 పరుగులు చేశాయి.
ఈ విజయంతో భారత్ రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. తొలి టెస్టులో భారత్-ఏ ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఐదు అనధికారిక వన్డే మ్యాచ్‌ల సిరీస్ అక్టోబర్ 6నుంచి విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.