India Tour Of Zimbabwe: ఎన్నాళ్లకు జింబాబ్వే గుర్తొచ్చింది... టీమిండియా రాక కోసం వేయికళ్లతో వెయిటింగ్

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మున్ముందు తీరిక లేని షెడ్యూల్ ఉంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన అనంతరం భారత్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇక ఆ తర్వాత ఆగస్టులో వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ కోసం టీమిండియా ఆఫ్రికన్ దేశం అయిన జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఇక ఇది మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్. ఇక ఈ సిరీస్ ఆగస్టు 18న హరారేలో ప్రారంభమవుతుంది. ఇకపోతే ఈ వన్డే సిరీస్ జింబాబ్వేకి చాలా కీలకం. ఎందుకంటే ఈ సిరీస్ ద్వారా ఆ జట్టుకు వచ్చే పాయింట్లు వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించడానికి ఉపయోగపడతాయి. వన్డే ప్రపంచకప్ కోసం భారత్ నేరుగా అర్హత సాధించే జట్టుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక జింబాబ్బే ప్రపంచకప్ టోర్నీ ఆడాలంటే.. పలు అర్హత టోర్నీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

భారత జట్టు రాకతో చెప్పలేనంత సంతోషం
ఇక ఈ సిరీస్లోని మూడు మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్నాయి. భారత బృందం ఆగస్టు 15న హరారేకు చేరుకుంటుంది. ఇక 'భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఈ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాం. ఈ చిరస్మరణీయ సిరీస్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నాం' అని జింబాబ్వే క్రికెట్ పేర్కొంది. అలాగే భారత ప్లేయర్లతో ఆడే అవకాశం దక్కడంతో పాటు అపూర్వ అనుభవాన్ని పొందేందుకు జింబాబ్వే క్రికెటర్లకు ఈ సిరీస్ ఓ గొప్ప అవకాశం అని తెలిపింది.

జింబాబ్వే క్రికెట్‌కు ఎంతో మేలు
ఈ సిరీస్ జింబాబ్వే యువతకు క్రికెట్ పట్ల మరింత ఆసక్తి కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని, ఈ సిరీస్ జింబాబ్వే క్రికెట్‌కు చాలా ఉపయుక్తమవుతుందని జట్టు మాజీ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ అన్నారు. ప్రస్తుతం అతను జింబాబ్వే క్రికెట్ టెక్నికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇకపోతే గత ఆరేళ్లుగా జింబాబ్వే పర్యటనకు భారత్ వెళ్లలేదు. 2016 జూన్-జూలైలో MS ధోనీ నేతృత్వంలో చివరిసారిగా భారత జట్టు జింబాబ్వేలో పర్యటించింది. అప్పుడు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లు ఇరు జట్ల మధ్య జరగాయి.

ఆండీ ఫ్లవర్, గ్రాండ్ ఫ్లవర్, హీత్ స్ట్రీక్ లాంటి ప్లేయర్ల హయాంలో..
మళ్లీ ఆరేళ్ల తర్వాత జింబాబ్వేకు టీమిండియా వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకప్పుడు జింబాబ్వే అంతర్జాతీయ క్రికెట్లో టాప్ 10జట్లలో ఉండేది. క్రమేపీ ఆ జట్టు స్థానం ఇంటర్నేషనల్ మ్యాచుల్లో వెనకబడింది. ఆండీ ఫ్లవర్, గ్రాండ్ ఫ్లవర్, హీత్ స్ట్రీక్, మసకజ్జ, చిగుబురా తదితర ఆటగాళ్ల హయాంలో జింబాబ్వే క్రికెట్ ఓ వెలుగు వెలిగింది. ఇక భారత పర్యటన ద్వారా జింబాబ్వే క్రికెట్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

జింబాబ్వేలో భారత జట్టు పర్యటన షెడ్యూల్:
వన్డే సిరీస్:
మొదటి వన్డే: గురువారం, ఆగస్టు 18, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
రెండవ వన్డే: శనివారం, ఆగస్టు 20, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
మూడో వన్డే: సోమవారం, ఆగస్టు 22, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications