
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : టీమిండియా వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం తొలి మ్యాచ్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత యువ జట్టు బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లన్నీ ఇండియా టైమింగ్ ప్రకారం.. రాత్రి 7గంటలకు ప్రారంభమై వేకువజామున 3.30కు ముగుస్తాయి. దీంతో మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఇండియా అభిమానులు తెల్లార్లు మేల్కొని చూడాల్సిన పరిస్థితి. పైగా ఈ మ్యాచ్‌కు అఫీషియల్ బ్రాడ్ కాస్టర్లుగా.. సోనీ నెట్ వర్క్, స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, నెట్ వర్క్ 18 లాంటి దిగ్గజ సంస్థలు ముందుకు రాలేదు. ఎందుకంటే.. రెవెన్యూ జెనరేటెడ్ పరంగా.. వ్యూయర్ షిప్ టైమ్ ప్రకారంగా కమర్షియల్‌గా ఆ ఛానళ్లకు వెస్టిండీస్ టూర్ వల్ల పెద్ద లాభాలేవీ రావు. దీంతో బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ కోసం అవి దూరంగా ఉన్నాయి.
ఫ్యాన్ కోడ్‌లో చూడొచ్చు కానీ ఇట్స్ టూ కాస్ట్‌లీ
ఇక అనూహ్యంగా ఫ్యాన్ కోడ్ యాప్ తక్కువ ధరకే రైట్స్ దక్కడంతో వెబ్ అండ్ యాప్ బేస్డ్ రైట్స్ దక్కించుకుంది. యాప్, వెబ్ ఆధారిత ప్రసారాలకు ఫ్యాన్ కోడ్ యాప్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఫ్యాన్ కోడ్‌లో మ్యాచ్‌లు చూడాలంటే పాస్ కొనుక్కోవాలి. టూర్ పాస్ 99రూపాయాలు కాగా.. యాడ్ ఫ్రీ పాస్ 169రూపాయలు, మంత్లీ పాస్ 199రూపాయలు పెట్టి కొనాలి. అలాగే ఫోన్‌లో డాటా కూడా మినిమం 2.5జీబీ మేర కావాలి. అంటే ఎంతలేదన్న 300 నుంచి 400రూపాయల ఖర్చు. ఇది సామాన్యులకు అదనపు భారమే. పైగా ఫోన్లో ఛార్జింగ్ సమస్య కూడా ఉంటుంది. అందువల్ల ఈ మ్యాచ్‌లు మిస్సవుతామేననో సగటు క్రికెట్ అభిమాని వాపోయాడు.
కోట్లాది అభిమానులకు దూరదర్శన్ ఆపన్నహస్తం
టెలివిజన్ హక్కుల కోసం ఏ ఛానెల్ బిడ్డింగ్ వేయకపోవడంతో ఎప్పటిలాగే పెద్దన్నలా నిలిచే భారత క్రీడా మంత్రిత్వ శాఖ, ప్రసార శాఖ ఉమ్మడి ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ ఛానల్ ఆపన్న హస్తం అందించింది. కోట్లాది మంది భారత అభిమానులను నిరాశపర్చకుండా టీవీల్లో లైవ్ ప్రసారం చేస్తోంది. ఇక వెస్టిండీస్ టూర్ మొత్తం టీవీల్లో చూడ్డానికి డీడీ స్పోర్ట్స్ ఛానల్ దిక్కయింది. డబ్బులొచ్చే మ్యాచ్‌లకే వత్తాసు పలికే ప్రైవేట్ ఛానళ్ల లోగుట్టును బయటపెట్టేలా.. అసలైన క్రీడాకాంక్షను కనబర్చుతూ ప్రైవేటు ఛానళ్లకు దీటుగా టీవీల్లో లైవ్ ప్రసారం చేస్తూ దూరదర్శన్ స్పోర్ట్స్ ఛానల్ ఆకట్టుకుంటుంది.
ప్రైవేటు ఛానళ్లకు ఎప్పుడూ మాకెంటీ అనే నైజమే
ఒకప్పుడు మ్యాచ్‌లు తప్పకుండా దూరదర్శన్ ఛానల్లో ప్రసారమయ్యేవి. క్రమంగా ప్రైవేటు ఛానళ్ల ఆధిక్యత పెరిగాక డీడీ స్పోర్ట్స్ ఛానల్ హవా తగ్గింది. ఇక గత 15, 20ఏళ్లుగా డీడీ స్పోర్ట్స్ ఛానల్లో మ్యాచ్‌ల ప్రసారాలు బాగా తగ్గిపోయాయి. ప్రైవేటు ఛానళ్లు తామంటే తాము అంటూ కొట్టుకుచచ్చి ఆటను పూర్తిగా కమర్షియల్‌గా మార్చేశాయి. అయితే వ్యూయర్ షిప్, రెవెన్యూ రాకపోతే కేవలం ఒక్కటంటే ఒక్క టూర్ కూడా తాము ప్రసారం చేయబోము అని ఆ ఛానళ్లు చెప్పకనే చెప్పేశాయి.
వెల్లువలా డీడీ స్పోర్ట్స్‌పై ప్రేమాభిమానాలు
ఇక అప్పట్లో డీడీ స్పోర్ట్స్ ఛానల్లో లైవ్ చూసిన భారత అభిమానులు తాజాగా మళ్లీ ఆ ఛానల్ వేదికగా మ్యాచ్‌లు చూడడాన్ని ఆస్వాదించారు. డీడీ స్పోర్ట్స్ ఛానల్ ప్రసారాల నాణ్యత మునుపటి కంటే ఎంతో బెటర్ అయిందని కొనియాడుతున్నారు. టీవీల్లో మ్యాచ్ చూడాలన్న ఆకాంక్షను తమకు డీడీ స్పోర్ట్స్ అందించడాన్ని వారు వేనోళ్ల కొనియాడుతున్నారు. కొందరు మీమ్స్ వీడియోలు, పోస్టులు చేస్తూ.. డీడీ స్పోర్ట్స్‌కు థాంక్యూ చెబుతున్నారు. మరికొందరు లవ్ యూ డీడీ స్పోర్ట్స్ అంటూ తమ ప్రేమాప్యాయతలను ఛానల్ మీద కురిపిస్తున్నారు.