
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన భారత్-శ్రీలంక పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ట్విటర్‌లో తెలిపింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో భారత క్రీడాకారులను శ్రీలంక పర్యటనకు పంపడం సాధ్యం కాదంటూ బీసీసీఐ.. శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలిపినట్టు సమాచారం.
కరోనా వైరస్ కారణంగా ఈ సిరీస్ జరగడం మంచిది కాదని బీసీసీఐ పేర్కొంది. 'జూన్-జూలైలో జరిగే ఈ సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంక వెళ్లడం వీలుకాదు. ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) బోర్డుకు కూడా తెలిపాం. అటు ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు ఎప్పుడు తొలగిస్తారో తెలీదు. అయితే త్వరలోనే ఈ సిరీస్ జరుగుతుందని భావిస్తున్నాం' అని బోర్డు కోశాధికారి అరుణ్ ధూమల్ తెలిపాడు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరులో కోహ్లీసేన లంక పర్యటనకు వెళ్లి మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే తాజాగా నెలకొన్న పరిస్థితులు, లాక్‌డౌన్ సడలింపులు ప్రకటించినా క్రీడల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ పర్యటన సాధ్యం కాదని బీసీసీఐ.. ఎస్‌ఎల్‌సీకి తెలిపింది. అనంతరం పరిమిత ఓవర్ల సిరీస్‌లు వాయిదా పడినట్టు ఐసీసీ అధికారికంగా తెలిపింది.
కరోనాతో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు క్రీడోత్సాహానికి సిద్ధంగా ఉన్నతరుణంలో భారత్-శ్రీలంక మ్యాచ్‌లు వాయిదా పడిన వార్త తమను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని పేర్కొంటూ పలువురు క్రీడాభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.