
అంతా బాగానే ఉన్నా.. ఆ అనుమానమే
ఇక్కడి దాగా అంతా బాగానే ఉన్నప్పటికీ.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత టీమిండియా పరిస్థితి ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం ఎవ్వరి వద్దా లేదు.. చివరికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్దల దగ్గర కూడా. జూన్ 18వ తేదీన ఆరంభమయ్యే మ్యాచ్.. రెండు జట్లూ పోటాపోటీగా ఆడితే 22వ తేదీన ముగుస్తుంది. దీని ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. కివీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోతుంది. ఆ తరువాతి షెడ్యూల్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తుంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత టీమిండియా ఏం చేస్తుందనేది పజిల్.

42 రోజులు ఖాళీగా ఉండాల్సిందేనా
బీసీసీఐ డిజైన్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 3వ తేదీన ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టబోయే భారత జట్టు మళ్లీ అక్కడి నుంచి బయటపడేది సెప్టెంబర్‌లోనే. దాదాపు నాలుగున్నర నెలలు అక్కడే ఉంటుంది కోహ్లీసేన. నిజానికి- ఇంగ్లాండ్‌తో టీమిండియా అయిదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.
తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 4వ తేదీన నాటింగ్‌హామ్‌లో ఆరంభమౌతుంది. జూన్ 22వ తేదీన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తరువాత.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ఆరంభం కావడానికీ మధ్య నెలన్నర వ్యవధి ఏర్పడింది. అంటే 42 రోజుల పాటు భారత జట్టు ఇంగ్లాండ్‌లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటుందనేది స్పష్టమౌతోంది.

దారుణంగా షెడ్యూల్..
ఒక దేశంలో టీమిండియా 42 రోజుల పాటు ఖాళీగా కాలం గడపాల్సి వచ్చేలా షెడ్యూల్ రూపొందించడం పట్ల భారత జట్టు మాజీ కేప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఇంత దారుణమైన షెడ్యూల్ ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక జట్టును దేశం కాని దేశంలో 42 రోజుల పాటు ఖాళీగా కూర్చోబెట్టడం ఏ మాత్రం సరికాదని, అన్ని రోజులు క్రికెటర్లు ఏం చేస్తారని ప్రశ్నించారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన వెంటనే టెస్ట్ సిరీస్ ఆరంభం అయ్యేలా షెడ్యూల్ ఎందుకు రూపొందించలేకపోయారని నిలదీశారు.

టీ20 ప్రపంచకప్ ముందు.. టెస్ట్ మ్యాచ్‌లా
ఒకవంక- శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ముందు వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 మ్యాచ్‌లను ఆడేలా షెడ్యూల్ రూపొందించుకోగా.. దానికి భిన్నంగా బీసీసీఐ టెస్ట్ మ్యాచ్‌లను ఆడనివ్వటంలో అర్థం లేదని వెంగ్‌సర్కార్ చెప్పారు. భారత్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడబోయే ఇంగ్లాండ్ జట్టు కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్‌లను ఆడుతుందని గుర్తు చేశారు. టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ను ఆడే అవకాశం లేదని, వారి ముందున్నది ఐపీఎల్ 2021లో మిగిలిపోయిన మ్యాచ్‌లేనని చెప్పారు.


Click it and Unblock the Notifications












