

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా-ఇంగ్లాండ్ జట్లు తలపడే అవకాశం ఉందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ టీమిండియాకు మూడోసారి వరల్డ్‌కప్ అందించే సత్తా ఉందని పేర్కొన్నాడు.
"ధోని లాంటి వికెట్ కీపర్ ఉండటం విరాట్ కోహ్లికి కలిసి వచ్చే అంశం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు కోహ్లీకి ధోని సలహాలు అవసరం. వారిద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. డెత్ ఓవర్లలో ఫీల్డర్‌ను ఎక్కడ పెట్టాలి.. ఎవరు ఎలా బౌలింగ్ చేయాలనే వ్యూహాలు రచించడంలో ధోని దిట్ట" అని గవాస్కర్ అన్నాడు.
"ఇవే కాదు చేజారుతున్న మ్యాచ్‌ను మన గుప్పిట్లోకి తీసుకురావడంలో ధోని చాలా సార్లు సఫలీకృతుడయ్యాడు. అందుకే అతడంటే కోహ్లీకి చాలా గౌరవం. వారి కెమిస్ట్రీతో భారత్ మూడోసారి కప్పు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి" అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ పరంగా మంచి పటిష్టంగా ఉందని గవాస్కర్ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లో కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నారని గవాస్కర్ కొనియాడాడు.
ఇక, వరల్డ్‌కప్‌లో పాక్‌తో తలపడే మ్యాచ్‌లో భారత జ్టటుపై అదనపు ఒత్తిడి ఏమీ ఉండదని గవాస్కర్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలని టీమిండియాకు తెలుసని అన్నాడు. "ఆటగాళ్లు అదనపు ఒత్తిడికి లోనవుతారని అనుకోను. ఈ క్రికెట్ మ్యాచ్ గెలిచి తీరాలని వారికి తెలుసు. ఆ పరిణతి వారికి ఉంది. వారు పరిస్థితులకు దూరంగా ఏమీ ఉండరు. అయితే గొప్ప జట్లు తమ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోవు. ఆటపైనే దృష్టి పెడతాయి. ఒక బ్యాట్స్‌మన్‌గా అంతకు ముందు బంతికి ఏం జరిగిందో మరిచిపోవాలి. తర్వాతి బంతిపై శ్రద్ధ పెట్టాలి" అని గవాస్కర్ అన్నాడు.