బెంగుళూరు: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శైలి అద్భుతం. ఆటలో ప్రతి అంశంలో పాలుపంచుకుంటూ ఉంటాడు. తాజాగా బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శుక్రవారం నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొన్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాసేపు వికెట్ కీపర్ అయ్యాడు.
వెస్టిండిస్‌లో జరిగే టెస్టు సిరిస్ కోసం టీమండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో కోహ్లీ సేన శిక్షణ శిబిరానికి హాజరైంది. ఈక్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతికి గ్లౌజులు తొడిగి కీపర్ అవతారమెత్తాడు. దానికి సంబంధించిన వీడియోని బీసీసీఐ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఈ వీడియోలో ఉమేష్ యాదవ్ బౌలింగ్ చేస్తుంటే ఛటేశ్వర్ పుజారా బ్యాటింగ్ చేస్తుంటే విరాట్ కోహ్లీ స్టంప్స్ వెనుక కీపింగ్ చేశాడు. అయితే కోహ్లీ కీపర్ అవతారం ఎత్తడం ఇదే మొదటిసారి కాదు. జూన్ 2015 మిర్‌పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని స్థానంలో కొన్ని ఓవర్లు కీపింగ్ చేశాడు.
ఇక శిక్షణ శిబిరంలో శనివారం ఉదయం టీమిండియా ఆటగాళ్లు యోగా చేశారు. శరీరాన్ని, మనసును చురుగ్గా ఉంచుకునేందుకు యోగాసనాలు వేశారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా యోగా శిబిరంలో పాల్గొన్నాడు. కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, రహానే, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ తదితరులు యోగాసనాలు వేస్తూ కనిపించారు.
ఈ నెలాఖరున కరేబియన్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా... వెస్టిండీస్‌తో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ నెల 21న ఆంటిగ్వాలో ఇరు దేశాల మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. మరోవైపు ఆదివారం ఎన్‌సీఏలో కుంబ్లే అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్, భారత కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, కోహ్లీ, సెలక్షన్ కమిటీ సభ్యులతో సమావేశంకానున్నారు.