హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరిలో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 5 లేదా 6 నుంచి కేప్‌టౌన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎస్‌ఏ, బీసీసీఐ మ్యాచ్‌ల తేదీలను మరికొన్ని రోజుల్లో ఖరారు చేస్తాయని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో తెలిపింది.
ఈ ఏడాది ఆరంభం నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన గురించి చర్చలు జరుగుతున్నా ఇరు బోర్డులు ఒక నిర్ణయానికి మాత్రం రాలేకపోయాయి. అయితే ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగామ్స్ ప్రకారం భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య 4 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

కాగా, స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ డిసెంబర్ 24న ముగియనుంది. దీంతో ఈ ఏడాది చివరి వారం వరకు దక్షిణాఫ్రికాకు చేరుకోదని గతంలో బీసీసీఐ తేల్చిచెప్పింది. తీరిక లేని షెడ్యూలు వల్ల భారత ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమని బీసీసీఐ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం ఒక సన్నాహక మ్యాచ్ కూడా నిర్వహించాలని క్రికెట్ దక్షిణాఫ్రికాను బీసీసీఐ కోరింది. ఏదేమైనా రెండు బోర్డులు చర్చించి నిర్ణయం తీసుకుంటే పూర్తి స్పష్టత లభిస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన అనంతరం శ్రీలంకకు వెళ్లి ముక్కోణపు టి20 టోర్నీలో పాల్గొంటుంది.