
హైదరాబాద్: భారత కెప్టెన్ దాతృత్వం మళ్లీ బయటపడింది. దీనికి సఫారీ జట్టు సైతం చేయందించింది. సఫారీ పర్యటనకు వెళ్లిన భారత్ అక్కడి నీటి ఎద్దడికి తీవ్ర ఇబ్బందుల పాలైంది. తొలి టెస్టులోనేకాక చివరి టీ20 మ్యాచ్ సైతం కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో జరిగింది. పర్యటన మొదలైన కొద్ది రోజుల్లోనే భారత ఆటగాళ్లు కేవలం రెండు బకెట్లతోనే సర్దుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పరిస్థితిని అర్థం చేసుకున్న భారత జట్టు వాళ్లకు సహకరించింది. తీవ్ర వర్షాభావంతో నీటికి కటకటలాడుతున్న కేప్‌టౌన్‌కు భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు 8,500 అమెరికన్ డాలర్లు (రూ.5.52 లక్షలు) విరాళం ప్రకటించాయి. ఈ డబ్బును నగరంలో బాటిళ్లతో నీటి సరఫరా, బోర్లు వేసేందుకు వినియోగిస్తారు.
గత శనివారం కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో మూడో టి20 అనంతరం ఈ మొత్తాన్ని రెండు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, డు ప్లెసిస్‌లు 'గివర్స్ ఫౌండేషన్'కు అందజేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టుతో పాటు మూడో వన్డే, చివరి టి20లకు కేప్‌టౌన్ ఆతిథ్యమిచ్చింది. ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీల వేలం ద్వారా నగరంలో నీటి ఎద్దడి నివారణకు నిధులు సేకరించాలని తాను, కోహ్లి చర్చించుకున్నామని డు ప్లెసిస్ చెప్పాడు.
కాగా, ముక్కోణపు సిరీస్‌లో కోహ్లీ వెన్ను నొప్పి కారణంగా దూరమయ్యాడు. ఇంతకుముందే సెలక్టర్లు ఈ సిరీస్ కు కోహ్లీకి విశ్రాంతి ఇవ్వనున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్సీ వహిస్తుండగా, ధావన్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
సిరీస్‌లో పాల్గొననున్న రోహిత్ సేన:
రోహిత్‌శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, విజయ్ శంకర్, శార్దూల్ ఠాకూర్, జయ్‌దేవ్ ఉనద్కత్, మహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్.