
ముంబై: టెస్టుల్లో పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా కంటే శార్ధూల్ ఠాకూర్ మంచి ఆప్షన్ అని టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఠాకూర్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నారు. వెన్నునొప్పి కారణంగా ఇప్పటికే బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్.. టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్‌లు వేయలేడన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే శార్దుల్‌ను సానబెట్టాలని శరణ్‌దీప్ టీమిండియాకు సూచించారు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ ఎంపిక చేసిన 15 మంది జాబితాలో ఆల్‌రౌండర్ శార్ధూల్ ఎంపిక కాని విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా ఆడాడు.
శరణ్‌దీప్ సింగ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'ఇటీవల కాలంలో బ్యాటింగ్‌కే పరిమితమైన హార్దిక్ పాండ్యా.. వెనునొప్పి కారణంగా ఎక్కువగా బౌలింగ్ చేయడం లేదు. ఒకవేళ వేసినా సుదీర్ఘ స్పెల్‌లు వేయడం చాలా కష్టం. ఈ కారణంగా మరో అదనపు బౌలర్‌ను తుది జట్టులోకి తీసుకోవాల్సి వస్తోంది. ఎప్పుడూ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌పైనే ఆధారపడొద్దు. మూడు ఫార్మాట్లలో అతనెప్పుడు ఫిట్‌గా తయారవుతాడో, ఎప్పుడు బౌలింగ్ చేస్తాడో తెలియదు. కాబట్టి హార్దిక్ స్థానంలో శార్దుల్ వంటి ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలి. విజయ్ శంకర్, శివమ్ దూబే వంటి వారికి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి' అని అన్నారు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో శార్ధూల్ ఠాకూర్ మంచి ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో రాణించాడు. ఆపై ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌లో బంతితో కీలక వికెట్లు తీశాడు. మొత్తంగా బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించి జట్టుకు మంచి ఆల్‌రౌండర్‌గా మారాడు. దీంతో రాబోయే కాలంలో అతడు జట్టులో కీలక ఆటగాడిగా మారే అవకాశం ఉందని శరణ్‌దీప్ సింగ్ అభిప్రాయపడ్డారు.
పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు ఎక్కువ మ్యాచ్‌ల్లో అవకాశాలు కల్పించాలని శరణ్‌దీప్ సింగ్ అన్నారు. 'ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఆటగాళ్ల రొటేషన్ పద్ధతి ఉంటుంది. సిరాజ్‌కు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడించి ప్రోత్సహించాలి. అతనిప్పుడు బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఒకవేళ అతడికి ఎప్పుడో ఒకసారి అవకాశాలిచ్చి రాణించమంటే ఇబ్బంది పడతాడు. అప్పుడు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం కష్టమవుతుంది. రాబోయే సిరీస్‌లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించినా.. పరిస్థితులను బట్టి అదనపు పేసర్‌ను కూడా తీసుకోవాలి' అని సూచించారు. ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇద్దరూ స్పిన్నర్లను ఆడించడం మంచిదేనన్న ఆయన.. చివరికి పరిస్థితులు పేస్‌కు అనుకూలించిందన్నారు.