ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకొద్దిరోజుల్లో ఈ టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. ఈ నెల 9వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి.
మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే మ్యాచ్ ల తేదీలు, గ్రూపులు, వెన్యూలు ఖరారయ్యాయి కూడా. ఈ టోర్నమెంట్ ఆడబోయే భారత జట్టుకు స్పానరర్ అంటూ ఎవడూ లేడు. టైటిల్ స్పాన్సర్ లేకుండానే ఈ టోర్నమెంట్ ఆడబోతోంది టీమిండియా. నాన్ ఐసీసీ టోర్నమెంట్లల్లో స్పానరర్ లేకుండా భారత జట్టు ఆడబోతోండటం ఇదే తొలిసారి. డ్రీమ్11 తమ కాంట్రాక్టును రద్దు చేసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

స్పాన్సర్ లేకపోవడం వల్ల జెర్సీలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్ల జెర్సీలపై ఇండియా లోగో మరింత పెద్దదిగా, స్పష్టంగా కనిపించనుంది. దాదాపుగా బ్లాంక్ జెర్సీలుగా చెప్పుకోవచ్చు. ప్రధాన టోర్నమెంట్లలో భారత ఆటగాళ్లు టైటిల్ స్పాన్సర్ లేకుండా ఆడటం ఇదే మొదటిసారి కాదు. ఐసీసీ ఈవెంట్లలో టైటిల్ స్పాన్సర్‌లను అనుమతించదు.
డ్రీమ్11 మధ్యలో తప్పుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు' కారణం. రియల్-మనీ గేమింగ్‌ను నిషేధించింది. 2023లో కుదుర్చుకున్న డ్రీమ్11 స్పాన్సర్‌షిప్ డీల్ విలువ సుమారు రూ. 358 కోట్లు). ఈ ఒప్పందం వాస్తవానికి 2026 వరకు కొనసాగాల్సి ఉంది. స్పాన్సర్ కోసం బీసీసీఐ ఇప్పటికే బిడ్డింగ్ ఆహ్వానించింది. ప్రధాన స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం ఇన్విటేషన్ టు టెండర్ విడుదల చేసింది. ఆసక్తిగల కంపెనీలు ఈ నెల 16 లోగా బిడ్డింగ్ దాఖలు చేయవచ్చు.
ఆసియా కప్ కు ఎంపికైన భారత జట్టులో- సూర్య కుమార్ యాదవ్ (కేప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కేప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఉన్నారు.
స్టాండ్‌బై: యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)