హైదరాబాద్: భారత్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న పాక్ జట్టంటే కోహ్లీసేనకు భయమని పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించకపోవడంపై బీసీసీఐని కూడా తప్పుబట్టారు.
'టీమిండియా మాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని ఛాలెంజ్ చేస్తున్నాం. వాళ్లు ఆడరు. మా జట్టుని చూసి భయపడుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో ఆడతాం కానీ.. బయట మాత్రం ఆడబోమని వాళ్లు చెబుతున్నారు' అని షహర్యార్ ఖాన్ విమర్శించారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాక్ జట్టుకు ప్రధాని షరీఫ్ ఇచ్చిన విందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, జూన్ 18న జరిగిన ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగైతే.. పాకిస్థాన్ క్రికెట్ వృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ప్రతి జట్టు తమతో క్రికెట్ ఆడాలని అనుకుంటున్నట్లు షహర్యార్ ఖాన్ తెలిపారు. 'అంతర్జాతీయ జట్లు ఇకపై పాకిస్థాన్‌లో ఆడాలి. ఇప్పుడు పూర్తి భద్రత ఉన్నది. ఇప్పటికే శ్రీలంక, బంగ్లా, వెస్టిండీస్‌లతో చర్చిస్తున్నాం' అని ఆయన చెప్పారు.
భారత్-పాకిస్థాన్ సరిహద్దు నెలకొన్న వివాదాల కారణంగా 2007 నుంచి భారత్- పాక్ మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు. ఆ తర్వాత నుంచీ కేవలం ఐసీసీ టోర్నీల్లో మ్యాచ్‌లకే పరిమితమయ్యాయి. 2015-2023 మధ్య కాలానికి ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లకు ఒప్పందాలు కుదుర్చుకున్నా అవి సాధ్యపడలేదు.
దీంతో రూ.387 కోట్లను పరిహారంగా చెల్లించాలంటూ పీసీబీ బీసీసీఐకి నోటీసులు పంపింది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పంపిన నోటీసులను బీసీసీఐ తేలిగ్గా తీసుకుంది.