భారత జట్టులో చోటు దక్కిందనే సంతోషం తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి కొన్ని రోజులు కూడా లేకపోయింది. టీమిండియా జెర్సీని ధరించకుండానే జట్టు నుంచి వైదొలిగాడు. జింబాబ్వే పర్యటనకు ఇటీవల ప్రకటించిన భారత జట్టులో తొలుత నీతీశ్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో సత్తాచాటి భవిష్యత్ స్టార్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు.
దీంతో ఏకంగా జాక్‌పాట్ కొట్టి భారత జట్టుకు తక్కువ వ్యవధిలోనే ఎంపికయ్యాడు. కానీ బుధవారం బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. 'అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ గాయపడిన నితీశ్ రెడ్డి స్థానాన్ని శివమ్ దూబేతో భర్తీ చేసింది. నితీశ్ గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది' అని బీసీసీఐ పేర్కొంది. అయితే నితీశ్ గాయం గురించి బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు.

దీంతో నితీశ్‌పై వేటు వేశారేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. దూబెను హార్దిక్ పాండ్యలా సిద్ధం చేయాలనే ఉద్దేశంతో నితీశ్‌కు బదులుగా దూబెకు అవకాశం ఇచ్చేరేమో అనే సందేహాలు కూడా వచ్చాయి. అయితే నితీశ్ గాయం కారణంగానే జట్టులో చోటు కోల్పోయాడని తెలిస్తోంది. హెర్నియా సమస్యతో ఈ తెలుగు తేజం బాధపడుతున్నట్టు సమాచారం.
దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తూ విజయాలు సాధించడం ప్రతి క్రికెటర్ కల. కొందరికి ఈ అవకాశం చాలా ఆలస్యంగా వస్తుంది. కానీ 21 ఏళ్లకే నితీశ్ ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే అదృష్టం తలుపు తట్టిన కొన్ని గంటలకే దురుదృష్టం గాయం రూపంలో అతని దరికి చేరింది. భారత జట్టు నుంచి దూరం చేసింది. ఈ నేపథ్యంలో నితీశ్ పరిస్థితి ఎవరికీ రాకూడదని, దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, జులై 4 నుంచి ప్రారంభమయ్యే జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(కీపర్), ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే.