భారత్ గొప్పగా పుంజుకుంది. రెండో టీ20లో ఓటమిపాలైన టీమిండియా మూడో టీ20లో ఘన విజయం సాధించింది. 11 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి నాలుగు టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అదే జోరును సెంచూరియన్ వేదికగా జరగనున్న ఆఖరి టీ20లోనూ కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సూర్యసేన పట్టుదలతో ఉంది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
అయితే భారత తుదిజట్టులో రెండు మార్పులు చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చాలని లేకపోయినా, సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో యువ క్రికెటర్లు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, ఫినిషర్ రింకూ సింగ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాక రింకూ సింగ్ గత మూడు మ్యాచ్‌ల్లో పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడు.

తొలి మ్యాచ్‌లో మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. రింకూ వరుసగా గత మ్యాచ్‌ల్లో 11, 9, 8 పరుగులే చేశాడు. మరోవైపు హార్దిక్ బ్యాటుతో కాస్త ఫర్వాలేదనిపిస్తున్నా బంతితో నిరాశపరుస్తున్నాడు. మూడో టీ20లో ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ ఒక్కరే తుదిజట్టులో ఉండటాన్ని సౌతాఫ్రికా క్యాష్ చేసుకుంది. ఈ నేపథ్యంలో రింకూ స్థానంలో జితేశ్ శర్మను, హార్దిక్ పాండ్య స్థానంలో యశ్ దయాల్‌ను జట్టులో తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌ను ఆర్సీబీ రూ.5 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అర్షదీప్ సింగ్ కూడా లెఫ్టార్మ్ బౌలరే. ఈ నేపథ్యంలో అర్షదీప్ సింగ్‌కు కూడా విశ్రాంతి ఇచ్చి అవేశ్ ఖాన్ లేదా యువ ప్లేయర్ విజయ్‌కుమార్ వైశాక్‌కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనతోనూ టీమిండియా మేనేజ్మెంట్ ఉంది.
నాలుగో టీ20కి భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేశ్ శర్మ, రమన్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, యశ్ దయాల్, అవేశ్ ఖాన్/విజయ్ కుమార్ వైశాక్.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమన్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.