
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరో క్రికెట్ సిరీస్ వాయిదా పడింది. సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్‌లను భారత్ వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 2021 ఆరంభంలో ఈ సిరీస్‌లను నిర్వహించే అవకాశం ఉంది. కరోనా తీవ్రత కారణంగా మన దేశంలో ఇప్పుడు ఎలాంటి సిరీస్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. వైరస్ కారణంగా ఈ అయిదు నెలల్లో జరగాల్సిన వేరే సిరీస్‌లను కూడా బీసీసీఐ వాయిదా వేసింది.
ఐసీసీ ఎఫ్‌టీపీలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లలో వన్డే, టీ20 సిరీస్‌లు జరగాల్సి ఉంది. ఇందులో 3 వన్డేలు, 3 టీ20లు ఆడాలని గతంలో నిర్ణయించారు. అయితే వైరస్ వ్యాప్తి కారణంగా మ్యాచులు జరిగే అవకాశం లేదు. మరోవైపు ఇవే తేదీల్లో యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. పాత షెడ్యూల్ ప్రకారం 2021 జనవరి-మార్చి మధ్య ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్‌కు రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ వన్డే, టీ20 సిరీస్‌లను కూడా టెస్టు సిరీస్‌లతో కలిసి అదే సమయంలో నిర్వహించాలని బీసీసీఐ చూస్తోందని సమాచారం.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. ఆ తర్వాత యూఏఈ నుంచే నేరుగా ఆస్ట్రేలియాకి టీమిండియా వెళ్లనుంది. అక్కడ డిసెంబరు 3 నుంచి నాలుగు టెస్టులు, జనవరి 12 నుంచి మూడు వన్డేలను కంగారూలతో ఆడనుంది. ఆ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా భారత్‌కి వచ్చిన వెంటన.. ఇంగ్లండ్‌తో జనవరి-మార్చిలో సుదీర్ఘ సిరీస్‌ని బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం తెలుస్తోంది.
జనవరి చివరి వారం నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌తో పాటు.. ఇప్పుడు వాయిదాపడిన మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కూడా జరిగేలా బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2021 సీజన్ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే ఏడాది పాటు టీమిండియా వరుస మ్యాచులతో బిజిగా గడపనుంది.