ముంబై: ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీల్లో కప్‌ను నిలబెట్టుకోవడం భారత జట్టుకు అత్యంత కష్టం కానుంది. భారత జట్టును బౌలింగ్ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ సమస్య పీడిస్తోంది. ఇషాంత్ శర్మ నేతృత్వంలోని పేస్ బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పిన్ విషయానికి వస్తే, ఫరవా లేదని అనిపించినప్పటికీ, అదే స్థాయిలో ఇతర దేశాల స్పిన్ బౌలింగ్ మెరుగు పడింది.
అయితే, భారత్ విషయానికి వస్తే పేస్ బౌలింగ్‌లో బలహీనంగా ఉండడమనేది మొదటి నుంచీ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత పేస్ బౌలర్లు పరుగులను వరదలా ఇచ్చేస్తుండడం సమస్యగా మారింది. దానికి తోడు, ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం పీడలా పరిణమించింది. ఈ సిరీస్‌లో భారత్ ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండును ఎదుర్కుంది.

గత కొన్నేళ్లుగా అన్ని దేశాల్లోని అన్ని పరిస్థితుల్లోనూ భారత్ క్రికెట్ ఆడిందని, అందువల్ల మ్యాచులు ఎలా గెలవాలో భారత జట్టుకు తెలుసునని కోచ్ డంకెన్ ఫ్లెచర్ అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ కప్ గెలవడానికి అవకాశం ఉందని అంటున్నారు.
భారత జట్టులో బలమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. బ్యాటింగ్‌లో మేటి ఆటగాళ్లుగా ప్రసిద్ధి పొందారు. అయితే, వారి నిలకడ మీదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రోహిత్ శర్మ వన్డేల్లో రెండు సెంచరీలు చేశాడు. కానీ అతను నిలకడగా రాణించగలడా అనేది అనుమానంగానే ఉంది. శిఖర్ ధావన్ ఫామ్ లేక బాధపడుతున్నాడు. అతని స్థానంలో అజింక్యా రహనే బ్యాటింగ్ దిగవచ్చు.
విరాట్ కోహ్లీ ఫామ్ మీద, సురేష్ రైనా శక్తి మీద, ధోనీ ఫినిషింగ్ క్లోజ్ మీద మాత్రమే భారత విజయాలు ఆధారపడి ఉంటాయనే అభిప్రాయం బలంగా ఉంది. గత మూడేళ్లుగా భారత జట్టు మూడు ఐసిసి టోర్నమెంట్స్ ఆడింది. వాటిలో భారత్ రెండు మ్యాచులు మాత్రమే ఓడిపోయింది. వాటిలో ఫైనల్ ఒకటి. ఇది మాత్రమే భారత జట్టును ముందుకు నడిపించే శక్తిగా మారింది.