
హైదరాబాద్: బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో ఇంగ్లాండ్ ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు, ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను చేజార్చుకున్న టీమిండియా తన ఖాతాలో నుంచి 10 పాయింట్లను కోల్పోయింది.
మంగళవారంతో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ముగియగానే ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు నంబర్ వన్ స్థానంలో టీమిండియాకు పాయింట్ల పరంగా చాలా వ్యత్యాసం ఉండటంతో భారత్ ర్యాంకులో ఎలాంటి మార్పు రాలేదు.
10 పాయింట్లు కోల్పోయినా ఇప్పటికీ 115 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 4-1తో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్ 105 పాయింట్లతో న్యూజిలాండ్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ సిరీస్ ప్రారంభమయ్యే నాటికి భారత్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ 97 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
ఇక, బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ యథావిధంగా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో ముగిసిన సిరీస్‌లో 59.30 యావరేజితో 593 పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
టీమిండియా తిరిగి అక్టోబర్‌లో వెస్టిండిస్‌తో టెస్టు సిరిస్ ఆడనుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు అక్టోబర్ 4న రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. మరోవైపు ఇంగ్లాండ్ తన తదుపరి టెస్టు సిరిస్‌ను శ్రీలంకతో ఆడనుంది. ఈ టెస్టు సిరిస్ నవంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.