విశాఖపట్నంలో ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోరును సాధించి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన అత్యధిక స్కోర్లలో ఇది రెండోది కావడం విశేషం. అయితే భారత జట్టు సులభంగా 350 పరుగుల మార్కును దాటుతుందని భావించినా, చివర్లో వికెట్లు కోల్పోవడంతో ఆ పరుగులు మిస్సయ్యాయనే భావన కలుగుతోంది.
మంధాన, ప్రతికా అద్భుత ఆరంభం
భారత ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతికా రావల్ అద్భుతంగా ఆరంభించారు. వరల్డ్ కప్‌లో నిరాశపరిచిన మంధాన ఈ మ్యాచ్‌లో 66 బంతుల్లో 80 పరుగులు చేసి తన ఫామ్‌ను తిరిగి అందుకుంది. ప్రతికా రావల్ కూడా ఆమెకు సరైన మద్దతు ఇస్తూ చక్కటి ఇన్నింగ్స్ ఆడింది. ఈ జోడీ తొలి వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, భారత్‌కు పటిష్టమైన పునాది వేసింది.

చివరిలో కుప్పకూలిన మిడిల్ ఆర్డర్
మంచి ఆరంభం లభించినా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు నిరాశపరిచారు. హర్లీన్ డియోల్(42 బంతుల్లో 38), హర్మన్‌ప్రీత్ కౌర్(17 బంతుల్లో 22), జెమీమా రోడ్రిగ్స్(21 బంతుల్లో 33), రిచా ఘోష్(22 బంతుల్లో 32) శుభారంభాలు చేసినా, వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. దీంతో భారత జట్టు స్కోరు వేగం తగ్గి, చివరిలో కేవలం 36 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ వికెట్ల పతనం కారణంగానే భారత్ 350 మార్కును చేరుకోలేకపోయింది.
అనాబెల్ సదర్లాండ్ అసాధారణ ప్రదర్శన
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై కూడా ఆస్ట్రేలియా బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ అత్యుత్తమంగా రాణించింది. ఆమె తన పేస్‌లో చతురతతో వైవిధ్యాన్ని చూపిస్తూ, కీలక వికెట్లు తీసి 5 వికెట్ల హాల్ సాధించింది. ఆమె ప్రదర్శనతోనే ఆస్ట్రేలియా జట్టు చివరి ఓవర్లలో భారత్‌ను కట్టడి చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో మొలినియు 3 వికెట్లు పడగొట్టగా.. గార్డనర్, మేఘన్ షుట్ తలో వికెట్ పడగొట్టారు.
ఆస్ట్రేలియాకు అవకాశం.. భారత్‌కు సవాల్
ఆస్ట్రేలియా బౌలర్లు చివరిలో బాగా పుంజుకున్నప్పటికీ, ఛేదించాల్సిన లక్ష్యం చాలా పెద్దది. అయితే సాయంత్రం వేళ పిచ్‌పై మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ ప్రభావం ఉంటే భారత్ బౌలర్లకు బంతిని నియంత్రించడం కష్టమవుతుంది. అందుకే భారత్ మరో 15-20 పరుగులు అదనంగా చేసి ఉంటే బాగుండేదని భావించవచ్చు.ఏదేమైనా 331 పరుగులు అనేది భారీ లక్ష్యమే. ఇప్పుడు భారత బౌలర్లు ఈ ఛేదనకు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా ఉమెన్ ప్లేయింగ్ XI: అలిస్సా హీలీ (w/c), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అనాబెల్ సదర్లాండ్, యాష్లే గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మేగాన్ షూట్.
ఇండియా ఉమెన్ ప్లేయింగ్ XI: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (w), అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.